హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజల పక్షపాతిగా బలపడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు పేరిట బలహీనపర్చాలని పాలకపక్షాలు కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ కుట్రలో భాగంగానే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను అణచివేయాలని కాంగ్రెస్, బీజేపీ ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఈ-కార్ రేసు నిర్వహించడం ఒక మంచి ప్రయత్నం అని చెప్పారు. దేశాభివృద్ధి, లక్ష్యాల సాధన, సంక్షేమం వంటి కీలక రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకుంటాయని, వాటిని ఆ తర్వాత ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. 2014లో ప్రత్యేక తెలంగాణలో తొలి సీఎం కేసీఆర్, ఐటీ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని వేగవంతంగా అభివృద్ధిపథంలో నడిపించారని వివరించారు. ఈ-కార్ రేసు హైదరాబాద్‌లో నిర్వహించడం వల్ల రాష్ట్రంలో రూ.700 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.
అధికారంలోకి వచ్చి రాగానే, ఇచ్చిన హామీలు వదిలిపెట్టి, ఆర్భాటంగా అందాల పోటీలు నిర్వహించి హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏం సాధించారని అని సురేశ్‌రెడ్డి నిలదీశారు. ఏసీబీ విచారణకు కేటీఆర్ పూర్తిగా సహకరించారని, ఇప్పుడు కేటీఆర్‌కు వాయిస్ లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్‌ను ప్రాసిక్యూషన్ చేసే విషయంలో చోటేభాయ్ అడగ్గానే, బడేభాయ్ అనుమతి ఇచ్చారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. ఈ కేసు విషయంలో లైడిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమని కేటీఆర్ తెలిపినా, అందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఈ కేసుతో ఏసీబీకి ఎలాంటి సంబంధం లేదని విమర్శించారు. అయినా ఇప్పటికే మూడుసార్లు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారని తెలిపారు. ఫార్ములా ఈ-రేస్ ఒక లొట్టపీసు కేసు అని ఇప్పటికే కేటీఆర్ తేల్చిపడేశారని పేర్కొన్నారు. ఈ-రేస్‌కు కేంద్ర మంత్రులు కూడా వచ్చారన్న సంగతిని గుర్తుచేశారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ-రేస్ నిర్వహించినట్టు తెలిపారు. రైతులు, ప్రజలకు ఎలాంటి సమాధానాలు చెప్పలేకే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ సహకారం ఏ విధంగా ఉన్నదో ప్రజలకు తెలిసిపోయిందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌కు బీ టీమ్‌గా మారిందని దుయ్యబట్టారు. ఈ కేసు విషయంలో బీఆర్ఎస్ భయపడేది లేదని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ కౌరవుల్లాగా బీఆర్ఎస్పై దాడికి పాల్పడుతున్నాయని, ఫార్ములా ఈ-కార్ రేస్ లాంటి కేసులు ఎన్ని పెట్టినా, బెదిరింపులకు దిగినా తాము భయపడేది లేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. ఈ కేసు విచారణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే, గవర్నర్ పాటించారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ను అణగదొక్కడం కోసం కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. రేవంత్..రాత్రి బీజేపీతో దోస్తీ చేసి, పొద్దున్నే కాంగ్రెస్ అంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలోనే 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు.
వికారాబాద్, నవంబర్ 20 : రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే ఫార్ములా ఈ రేస్ కేసు అని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయంగా లబ్ధి పొందాలని ఇలాంటి డ్రామాలకు తెరలేపిన రేవంత్ రెడ్డిది సరైన పద్ధతి కాదన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకు కేటీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ కేసు ఇన్నాళ్లు నిద్రావస్థలో ఎందుకు ఉన్నది అని ప్రశ్నించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టి ఎలాగైనా బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తల ధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్న రేవంత్ సర్కార్ అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ర్టానికే గొంతుక అని, చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశంలో బీఆర్ఎస్ పాల్గొని తన వాయిస్ వినిపించిందని ఎంపీ సురేశ్‌రెడ్డి తెలిపారు. బీహార్ ఎన్నికల్లో మహిళలకు రూ.10 వేల చొప్పున ఇవ్వడానికి వచ్చిన డబ్బులు తెలంగాణ నుంచి రాలేదా? అని ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి తెలంగాణ ఉన్న మహిళలకు రూ.10 వేలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు సంగతిని పట్టించుకోకుండా, అరిగోస పడుతున్న పత్తి, సోయా రైతులను ఆదుకోకుండా, వరి ధాన్యం కొనుగోలు చేయకుండా చోద్యం చూస్తూ, ఫార్మలా ఈ-కార్ రేసు కేసు అంటూ కాంగ్రెస్ సర్కార్ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు.