హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమానికి సుముహూర్తం కుదిరింది. మధ్యా హ్నం 1:20 గంటలకు ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమయానికి గ్రహగతులు అనుకూలంగా ఉండటంతోపాటు మీన లగ్నం కావడం కలిసొచ్చే అంశమని సిద్ధాంతులు పేర్కొన్నారు. లగ్నంలో, అందులోనూ స్వక్షేత్రంలో గురువు ఉండటం, భాగ్యస్థానంలో రవి, రాజ్యస్థానంలో బుధ, శుక్రులు ఉండటం, లాభస్థానంలో శని స్వక్షేత్రంలో ఉండటం యోగదాయకమని చెప్తున్నారు. విజయదశమి సందర్భంగా జాతీయపార్టీని ప్రకటించిన ముహూర్తానికి గురువు అనుగ్రహం పరిపూర్ణంగా కుదిరిందని, ఈ ముహూర్తానికీ గురువే పాలకగ్రహం కావటం విశేషమని జోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కారకాంశ లగ్నరీత్యా కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. గురువు, నెఫ్ట్యూన్ కలిసి ఉండటం, అతి సమీపంగా ఉండటం జనాకర్షక యోగంగా పరిగణిస్తారని, ఈ లగ్నానికి ఆ యోగం కుదిరిందని చెప్తున్నారు. భారత రాష్ట్ర సమితి జైత్రయాత్ర కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. సంఖ్యాశాస్త్రం ప్రకారంగానూ ఇవాళ్టి తేదీ 9-12-2022 మొత్తం కలిపితే తొమ్మిది రావటం కూడా ప్రత్యేకమే. మొత్తంగా బీఆర్ఎస్ ప్రస్థానం ఆశించినస్థాయిలో విజయపథంలో సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.