మారేడ్పల్లి, నవంబర్ 26: క్రైస్తవ సమాజం కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే క్రైస్తవులకు న్యాయం జరుగుందని పలు క్రైస్తవ సంఘాలు స్పష్టం చేశాయి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వకుండా మోసగించిన కాంగ్రెస్ను క్రైస్తవులు ఎప్పటికీ నమ్మరని క్యాథలిక్ అసోసియేషన్ తెలంగాణ, తెలంగాణ క్యాథలిక్ లేమోన్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆలిండియా క్యాథలిక్ అసోసియేషన్, తెలంగాణ తమిళ సంఘం నేతలు మెల్విన్ బెనిడిక్, ఆండ్రూస్ జేవియర్, కిస్టోఫర్ షిండే, పాల్ సంపత్ కుమార్, జెరూసలేం మత్తయ్య ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
1950లో క్రైస్తవ మతంలోకి మారిన జైనులు, సిక్కులు, బౌద్ధులను ఎస్సీలుగా గర్తించినప్పటికీ దళిత క్రైస్తవులకు మాత్రం ఆ హోదా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ నాటి యూపీఏ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదని తెలిపారు. తెలంగాణలో క్రైస్తవులు ప్రశాంతంగా జీవించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వీలుకల్పించిందని, అందుకే క్రైస్తవ సంఘాలన్నీ బీఆర్ఎస్కే మద్దతు పలుకుతున్నాయని వివరించారు.