హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ‘జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉంది. ఇక్కడి ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం కష్టమే’ ఈ మాటలన్నది ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలే. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పరిస్థితిపై స్థానిక నేతలు పార్టీ పెద్దలకు కుండబద్దలు కొట్టినట్టు, సరిగ్గా దృష్టి పెట్టకపోతే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం కష్టమేనని తేల్చి చెప్పినట్టు తెలిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్‌లో త్వరలో ఉప ఎన్నిక జరుగనున్నది. ఈ నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి నివాసంలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఝాన్సీ, ఎంపీ అనిల్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ నేతలు అజారుద్దీన్, రోహిణ్‌రెడ్డి రహస్య సమావేశం నిర్వహించినట్టు సమాచారం. ఈ సమావేశానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ డివిజన్లకు చెందిన పలువురు కీలక కార్యకర్తలను పిలిపించుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలిసింది.
మంత్రి వివేక్‌కు ‘ఆర్థిక’ బాధ్యత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంఅగెస్ నేతలు, కార్యకర్తలకు అవసరమైన సౌకర్యాల కల్పన బాధ్యతను మంత్రి వివేక్ వెంకటస్వామికి అప్పగించినట్టు విశ్వసనీయ సమాచారం. ఎవరికి ఏం కావాలన్నా, ‘ఆర్థిక’ అవసరాలన్నీ ఆయనే తీర్చుతారని నేతలకు చెప్పినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతలకు ప్రభుత్వంలో ఎలాంటి పని కావాలన్నా, ఏ అవసరమున్నా మంత్రులు పొన్నం, వివేక్‌లను సంప్రదించాలని సూచించినట్టు భోగట్టా. సదరు మంత్రులు కూడా ‘మీకు మేమున్నాం. ఇప్పటి నుంచి పూర్తి బాధ్యత మాదే. మీకు ఏం కావాలన్నా మమ్మల్ని అడగండి’ అని చెప్పినట్టు తెలిసింది.
ఖర్గే సభకు 10వేల మంది టార్గెట్
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సభకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి 10 వేల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టినట్టు సమాచారం. ఈ మేరకు ఆ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఇందుకు అవసరమైన వసతులన్నీ మంత్రి వివేక్ చూసుకుంటారని చెప్పినట్టు సమాచారం.
మేయర్‌పై నేతల గుస్సా
డివిజన్లలో తాను పర్యటనకు వెళితే కాంగ్రెస్ నేతలు, కార్యకరలెవరూ రావడం లేదని, తనకు సహకరించడం లేదని మేయర్ విజయలక్ష్మి ఈ సమావేశంలో చెప్పడంతో ఆమెపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఓ దశలో స్థానిక నేతలంతా ఆమెపై తిరుగుబాటు చేసి, ‘అసలు మా డివిజన్లకు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమే. నిన్న మొన్న పార్టీలోకి వచ్చి మాపై పెత్తనం చేలాయిస్తామంటే కుదరదు’ అని మండిపడినట్టు సమాచారం.
పోటీలో టీడీపీ ఉంటుంది..కాంగ్రెస్‌కు సహకరిస్తుంది..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీలో ఉంటుందని, కాంగ్రెస్‌కు సహకరిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు తెలిసింది. ఇక ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ఏమీ ఉండబోదని ఆయన అన్నట్టు సమాచారం. ఇంతలో ఎమెల్యే దానం నాగేందర్ కల్పించుకొని..కార్యకర్తలకు అండగా ఉంటానని, పార్టీ మారబోనని హామీ ఇచ్చినట్టు తెలిసింది.