కొత్త ప్రభుత్వం కొలువుదీరి వంద రోజులు కాకముందే కరెంటు, నీళ్ల కటకటలు మొదలయ్యాయి. సాగునీరందక చాలాప్రాంతాల్లో ఎండిన పొలాలు దర్శనమిస్తున్నయి. పంటలను పశువులకు వదిలేస్తున్నరు. సాగునీళ్లు వదలక భూగర్భ జలాలు కూడా రీచార్జ్ కాలేదు. బోర్లు కూడా వట్టిపోతున్నయ్. రైతుబంధు ఇంకా పడలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామన్న రుణమాఫీ ఇంకా చేయలేదు. ప్రజలంటే ప్రభుత్వానికి పట్టింపులేదు. కాంగ్రెస్ సర్కారులో ఇలాగే ఉంటుంది. రాష్ట్ర ప్రజలు పునరాలోచనలో పడ్డారు.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
BRS | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సర్వసన్నద్ధమవుతున్నది. తొలినుంచి అచ్చొచ్చిన, సెంటిమెంట్‌గా భావించే కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ నుంచే కదనభేరి మోగించాలని నిర్ణయించింది. ఆ తరువాత వరుసగా లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. గతానికి భిన్నంగా ఈసారి పార్లమెంటు నియోజకవర్గాల్లో మండలస్థాయి వరకు ప్రచారం సాగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బస్సుయాత్రలు, రోడ్‌షోల ద్వారా ప్రజలను మరింత దగ్గరగా కలువనున్నారు. తెలంగాణభవన్‌లో ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్యనేతల సమావేశం సమావేశం నిర్వహించారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన నేతలతో కేసీఆర్ విడివిడిగా సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు ఈ నెల 13 తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నదని, దీనిని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్లో భారీ సభను ఏర్పాటు చేసుకుందామని ప్రతిపాదించారు. రాష్ట్రవ్యాప్తంగా మంచి మెసేజ్ వెళ్లేలా, లోక్‌సభ ఎన్నికల సన్నాహక సభగా దీనిని నిర్వహించాలని సూచించారు. దీనికి కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నేతలంతా అంగీకరించారు. భారీ బహిరంగ సభను ఎక్కడ నిర్వహించాలన్న చర్చ జరుగుతున్నపుడు పార్టీకి తొలి నుంచి అచ్చివచ్చిన ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో అయితే బాగుంటుందని కరీంనగర్ స్థానిక నేతలు పట్టుబట్టారు. పార్టీ మొదటినుంచి అక్కడ పెట్టిన ప్రతి సభ సక్సెస్ అయిందని, ఉద్యమకాలం నుంచి నేటివరకు ఆ గ్రౌండ్ సెంటిమెంట్ అని చెప్పారు. నేతలంతా ఎస్ఆర్ఆర్ మైదానంలో సభ పెట్టాలని ప్రతిపాదించడంతో కేసీఆర్ అందుకు ఒప్పుకున్నారు.
ఈ నెల 12న సభను నిర్వహించాలని ఆ రోజు వీలుకాకపోతే 11 లేదా 13వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే సభ ఉంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలవారీగా బస్సుయాత్ర చేపట్టాలని యోచిస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. బస్సుయాత్రతో రోడ్‌షోలు చేపడితే నియోజకవర్గంలోని ఎక్కువ గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలను చుట్టిరావచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రతి మండలంలో పార్టీ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించాలని, ఈ సన్నాహక సమావేశంలోనే కరీంనగర్ సభ గురించి వివరించాలని, పార్టీ గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని కేసీఆర్ సూచించారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నేతలూ మండల స్థాయిలో లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు, కోల్‌మైన్ ప్రాంతంలో గేట్‌మీటింగ్‌లు నిర్వహించాలని సూచించారు. సింగరేణి కార్మికులను కలిసి వారికి బీఆర్ఎస్ సర్కారు ఎలాం టి సౌకర్యాలు కల్పించింది, సింగరేణి సంస్థను ఎలా కాపాడింది వివరించాలని దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ మొదలైంది. చాలాచోట్ల రైతులకు సాగునీటిని ఇవ్వలేకపోతున్నారు. పంటలను పశువుల కోసం వదిలివేస్తున్నారు. ఎండిపోయిన పొలాలు దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల రైతులు పంట వేసుకోలేకపోయారు. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు కచ్చితంగా సాగునీళ్లు వచ్చేలా చూశాం.
-బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది. బీఆర్ఎస్కు శక్తి ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలు తమకు తాము శక్తిమంతులు కావడమే. తెలంగాణకు బలం ఇవ్వడమే.
-బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాలని, రాజకీయాలంటే గెలుపోటములు ఒక్కటే కాదని కేసీఆర్ ఉద్బోధించారు. గతం లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాను ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పానని గుర్తుచేశారు. ఏ పాత్రలో ఉన్నా ప్రజల కోసం పనిచేయడాన్ని నాయకులు అలవర్చుకోవాలని సూచించారు. గెలుపుతో పొంగిపోవద్దని, ఓటమితో కుంగిపోవద్దని, ఇప్పుడు ఓడిపోవడం కూడా ఒక రకంగా బీఆర్ఎస్కు మంచిదేనని, ప్రజలకు కూడా ఎవరేమిటో అర్థమవుతున్నదని చెప్పారు. ఒక్కసారి ఓడిపోతే ఏదో భూకంపం వచ్చినట్టుగా భావించొద్దని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని విశ్లేషించుకోవాలని, ఎక్కడైనా పొరపాటు జరిగిందనుకుంటే చక్కదిద్దుకుందామని స్పష్టంచేశారు. ప్రజలకు మేలు చేసే ప్రయత్నమే చేశామని, తొమ్మిదేండ్ల పాలనలో దేశంలో ఎవ్వరూ చేయనన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశామని వివరించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985-1989 మధ్య అనేక సంస్కరణలు తెచ్చారని, అయినా 1989లో ఓడిపోయారని, తర్వాత ప్రజలు వాస్తవాలను గుర్తించడంతో అంతకు రెట్టింపు మెజార్టీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ మొదలైందని కేసీఆర్ చెప్పారు. చాలాచోట్ల రైతులకు సాగునీటిని ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. రైతులు పంటలను పశువుల కోసం వదిలివేస్తున్నారని, ఎండిపోయిన పొలాలు దర్శనమిస్తున్నాయని, కొన్నిచోట్ల రైతులు పంట వేసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు కచ్చితంగా సాగునీళ్లు వచ్చేలా చూశామని గుర్తుచేశారు. కాలువల ద్వారా చెరువులను నింపి రైతులకు అందేలా చూశామని చెప్పారు. దీనివల్ల భూగర్భజలాలు పుష్కలంగా పెరిగి బోర్లలో నీళ్లుండేవని వివరించారు. ఇప్పుడు కాలువల ద్వారా చెరువుల్లోకి నీళ్లు నింపడంలేదని, బోర్ల ద్వారా పంటలకు నీళ్లు తోడుకుందామంటే కరెంటు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చాలాచోట్ల రైతుల్లో ఈ చర్చ మొదలైందని చెప్పారు. కరెంటు సమస్యను తీర్చేందుకు తాము ఎలా ప్రణాళికలు రచించి అమలు చేశామో వివరించారు. ఇప్పుడు మళ్లీ ఐఏఎస్ అధికారులను నియమించారని, గతంలో తాము విద్యుత్తు సంస్థల్లో పనిచేసిన సీనియర్ అధికారులతో సంస్థను నడిపామని గుర్తుచేశారు.
ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ గురించి స్పష్టమైన అవగాహన కలిగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందని చెప్పారు. బీఆర్ఎస్కు శక్తి ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలు తమకు తాము శక్తిమంతులు కావడమేనని, తెలంగాణకు బలం ఇవ్వడమేనని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ పార్టీ మొన్నటి శాసనసభ ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోలేదని, 39 స్థానాలు సాధించగలిగామని, మరో 15 స్థానాల వరకు తక్కువ ఓట్లతో ఓడిపోయామని వివరించారు. అధికార పార్టీకి, బీఆర్ఎస్కు మధ్య 1.8 శాతమే ఓట్ల తేడా ఉన్నదని స్పష్టంచేశారు. ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదని, మళ్లీ మనం వంద సీట్లతో అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తంచేశారు. ఓటమి వల్ల ఎవరేమిటో తెలుస్తున్నదని చెప్పారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను నదిలో వదిలేయలేమ ని, కొట్లాడుదామని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక నెల రోజులు ఆగితే ఫుట్‌బాల్ ఆడవచ్చని చెప్పారు.
ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదు. మళ్లీ మనం వంద సీట్లతో అధికారంలోకి వస్తాం. ఓటమి వల్ల ఎవరేమిటో తెలుస్తున్నది. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని నదిలో వదిలేయలేం. కొట్లాడుదాం. రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఒక నెల రోజులు ఆగితే ఫుట్‌బాల్ ఆడవచ్చు.
-బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లను ఆయా నియోజకవర్గాల నేతలు ప్రతిపాదించారు. వారి పేర్లపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సోమవారం వీరి పేర్లను పార్టీ అధికారికంగా ప్రకటించనున్నది. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా చెప్పారు. సోమవారం ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల సమావేశం నిర్వహించనున్నారు. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను సోమవారమే ప్రకటించే అవకాశం ఉన్నది. సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్‌రావు, కొప్పు ల ఈశ్వర్, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు హాజరయ్యారు.
మేడిగడ్డ బరాజ్ అంశం చర్చకు వచ్చినప్పుడు కేసీఆర్ స్పందిస్తూ.. ‘నోట్లోని ఒక పన్నుకు ఏదైనా సమస్య వస్తే ఆ పన్ను తీసివేస్తాం. అంతేగానీ మొత్తం పళ్లను ఊడగొట్టుకుంటామా? పోయిన పన్నుపై మాత్రమే దృష్టిపెట్టి దాన్ని ఎలా సరిచేయాలో చూసుకుంటాం’ మేడిగడ్డ బరాజ్ దగ్గర సమస్య వచ్చిన చోట దానిని పరిష్కరించుకుంటే సరిపోతుందని వివరించారు. దేశంలో, ప్రపంచంలో అనేక ప్రాజెక్టులు కట్టిన తర్వాత సమస్యలు వచ్చినవి ఉన్నాయని, సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రారంభించిన ఒక ప్రాజెక్టు కూడా ప్రారంభించిన 15 రోజులకే కొట్టుకుపోయిందని గుర్తుచేశారు. మన రాష్ట్రంలో కూడా అనేక ప్రాజెక్టులు ఇలా అయినవి ఉన్నాయని వివరించారు. తెలంగాణ ఏర్పడే నాటికి మిడ్‌మానేరు లో కూడా అనేక సమస్యలొచ్చాయని, వాటిని సరిదిద్ది ప్రజలకు నీళ్లిచ్చామని గుర్తుచేశారు.
దేశానికి, తెలంగాణకు బీజేపీ చేసిన గొప్పమేలు ఏమీలేదని, ఆ పార్టీది మతపిచ్చి అని కేసీఆర్ చెప్పారు. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు ఇలా అనేకం ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఎప్పటికీ సెక్యులర్ పార్టీనే అని, సెక్యులర్‌గానే ఉంటుందని స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలందరికీ చెప్పాలని దిశినిర్దేశం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని, త్రిముఖ పోరు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటుందని విశ్లేషించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి నాయకత్వలేమి ఉన్నదని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని తెలిపారు.