హైదరాబాద్, జూలై 3 (నమస్తేతెలంగాణ): ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించేందుకు ఎప్పుడంటే అప్పుడు బీఆర్ఎస్ రెడీగా ఉన్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలు కలిపి నిర్వహించినా అభ్యంతరం లేదని చెప్పారు. చేతనైతే మైక్ కట్ చేయకుండా మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్-బీజేపీ-టీడీపీలు కలిసి గోదావరిని చెరబట్టి తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న ఏపీ సీఎం చంద్రబాబు తాను తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. డీపీఆర్ సమర్పించకముందే కాళేశ్వరాన్ని నిలువరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆయన దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, సీతమ్మసాగర్, భక్తరామదాసు ఇలా అనేక నీటిపారుదల పథకాలకు అడ్డంకులు సృష్టించిన విషయాన్ని మరిచిపోయి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిన చందంగా తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించామని చెప్పడం చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం ఇప్పుడు బనకచర్లకు కూడా ప్రత్యేక నిధులివ్వాలని నిర్ణయించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి తన గురువైన చంద్రబాబుకు దాసోహమై రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని సంజయ్ దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పడంలో గురువుతో పోటీ పడుతూ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు. అవగాహన లేకుండా కేసీఆర్, హరీశ్‌రావుపై అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి తాను సభానేతననే సోయిలేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహణపై స్పీకర్‌కు లేఖ రాయాలని కేసీఆర్‌ను కోరడం విడ్డూరమని పేర్కొన్నారు. ఏడాదిన్నర దాటినా రేవంత్‌రెడ్డి తాను సీఎంననే విషయాన్ని మరిచిపోయి ఇంకా కేసీఆరే సీఎం అనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సైతం అవగాహన లేదని సంజయ్ విమర్శించారు. అందుకే వారు రేవంత్‌ను మించిపోయి అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అవగాహన పెంచుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమం గురించి ఏనాడూ నోరెత్తని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ బీఆర్ఎస్ నేతల బట్టలు విప్పుతానని, సీఎం రేవంత్‌పై కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని మాట్లాడాన్ని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కండ్లు తెరవాలని హితవు పలికారు. తెలంగాణ భవిష్యత్తును పణంగా పెట్టి భావితరాలకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ సహించబోదని, ప్రజాపోరాటాలకు సిద్ధంగా ఉన్నదని హెచ్చరించారు.
చేవేళ్ల ఎస్సీ డిక్లరేషన్‌పై సమాధానం చెప్పిన తర్వాతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే తెలంగాణ గడ్డపై అడుగుపెట్టాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా వర్గీకరణ సహా ఎస్సీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల బట్టలు విప్పుతామని కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ చంద్రబాబు, రేవంత్‌రెడ్డి బట్టలను రేవంత్‌రెడ్డి ఎప్పుడో విప్పేశారని అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజకీయాలు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్‌లోని హామీలన్నీ అమలవుతున్నాయని ఆయన పచ్చి అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. స్పీకర్‌పై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.