పాలకుర్తి, మే 15 : సీఎం రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో గురువారం బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. 16 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాక రైతులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పాలకుర్తి నియోజకవర్గం చర్లపాలెం, పోచంపల్లి కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు వడదెబ్బతో మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందాల పోటీల ఉన్న మీద ప్రేమ రైతాంగంపై లేదని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ర్టాన్ని దోచుకుతింటున్నారని, సెటిల్మెంట్లు చేస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే రైతుబంధు వేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్కు వంద సీట్లు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.