BRS | హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యతను సొంతం చేసుకోబోతున్నదని సీ-ప్యాక్ (సివిక్ పోల్ ఎనాలసీస్ కమిటీ) సర్వే వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వివరాలను సీ-ప్యాక్ కిరణ్ శనివారం వివరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కే తెలంగాణ ప్రజలు జైకొట్టినట్టు తెలిపారు. కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని తేల్చి చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ సర్వే నూరుపాళ్లు నిజమైనట్టే లోక్‌సభ ఎన్నికల్లో కూడా నిజమని తేలుతుందని స్పష్టంచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 44.95 శాతం, కాంగ్రెస్‌కు 27.56 శాతం, బీజేపీకి 26.38 శాతం, ఎంఐఎంకు 0.77 శాతం ఓట్లు వచ్చినట్టు సీప్యాక్ సర్వే అంచనా వేసింది. సీట్లవారీగా చూస్తే బీఆర్ఎస్కు 11, బీజేపీకి 2, కాంగ్రెస్‌కు ఒక సీటు మాత్రమే రావొచ్చని పేర్కొంది. ఇక ఎంఐఎంకు తన సీటును పదిల పరుచుకుంటుందని తెలిపింది. రెండు స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని వెల్లడించింది.
లోకసభ నియోజవర్గాలవారీగా గెలుపొందే పార్టీ
ఆదిలాబాద్ (బీజేపీ), పెద్దపల్లి (బీఆర్ఎస్), కరీంనగర్ (బీఆర్ఎస్), మెదక్ (బీఆర్ఎస్), జహీరాబాద్ (బీఆర్ఎస్), చెవెళ్ల (బీఆర్ఎస్), నాగర్‌కర్నూల్ (బీఆర్ఎస్), మహబూబ్‌నగర్ (బీజేపీ), సికింద్రాబాద్ (బీఆర్ఎస్), హైదరాబాద్ (ఎంఐఎం), మల్కాజ్గిరి (బీఆర్ఎస్), మహబూబాబాద్ (బీఆర్ఎస్), నల్గొండ (కాంగ్రెస్), ఖమ్మం (బీఆర్ఎస్), నిజామాబాద్ (బీఆర్ఎస్/బీజేపీ), భువనగిరి (బీఆర్ఎస్/కాంగ్రెస్)
బీఆర్ఎస్కే జైకొట్టిన పట్టభద్రులు
ఇటీవల జరిగిన ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించనుందని సీప్యాక్ సర్వే ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 41.17 శాతం, కాంగ్రెస్‌కు 33.81 శాతం, బీజేపీకి 13.26 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇతరులకు 8.52 శాతం, నోటాకు 3.24 శాతం ఓట్లు పోలైనట్టు తెలుస్తున్నదని సీప్యాక్ వెల్లడించింది.
సికింద్రాబాద్-కంటోన్మెంట్‌లోనూ కారు జోరు
సికింద్రాబాద్-కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని బీఆర్ఎస్ నిలుపుకుంటుందని సీప్యాక్ సర్వే స్పష్టంచేసింది. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో బీఆర్ఎస్కు 50.49 శాతం, కాంగ్రెస్‌కు 37.29 శాతం, బీజేపీకి 11.63 శాతం, ఇతరులకు 0.59 ఓట్లు రానున్నాయని అంచనావేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో నిజమైన అంచనాలు
గత శాసనసభ ఎన్నికల్లో సీప్యాక్ ఎగ్జిట్‌పోల్ అంచనాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. కాంగ్రెస్‌కు 60, బీఆర్ఎస్కు 40, బీజేపీకి 4, బీఎస్పీ 2, ఎంఐఎం 5, ఎంబీటీ 1, సీపీఐ ఒక స్థానాల్లో గెలుస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసింది. ఓట్ల లెక్కింపు అనంతరం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ ఒక స్థానాల్లో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో సీప్యాక్ సర్వే తెలంగాణలోని రాజకీయపార్టీల్లో ఉత్కంఠ రేపుతున్నది.
సీ-ప్యాక్ సర్వే ప్రకారం..
పార్టీ : సీట్ల సంఖ్య
బీఆర్ఎస్ : 11
కాంగ్రెస్ : 01
బీజేపీ : 02
టఫ్‌ఫైట్ : 02
ఎంఐఎం : 01