Koppula Eshwar | పెద్దపల్లి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాల్సిందేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి, రైతు భరోసా అంటూ మాయమాటలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ రైతులను నిట్ట నిలువునా ముంచేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. అనేక కొర్రీలు పెట్టి రుణమాఫీకి ఎగనామం పెట్టిందని మం డిపడ్డారు. రూ.2 లక్షలలోపు రైతు రుణాలన్నీ మాఫీ చేయాలని, రైతు భరోసా డబ్బులు వా రి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని రంగంపల్లి జియో పెట్రోల్ బంక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీశారు.
కొప్పులతోపాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధూకర్, దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్, రైతులు ర్యాలీలో పాల్గొన్నా రు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి కాంగ్రెస్ సర్కార్, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత అదనపు కలెక్టర్ జల్ద అరుణశ్రీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడారు. తొమ్మిది నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరాచకాలను ప్రజలు చూశారని, ఇక రేవంత్‌రెడ్డి ఆటలు సాగవని హెచ్చరించారు. హైడ్రా భయంతో తెల్లారితే ఏం జరుగుతుంతో తెలియని భయానక వాతావరణంలో హైదరాబాద్ ప్రజలు బతుకున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి అస్తవ్యస్త పాలనపై విసిగి చెంది జనం తిరగబడేందుకు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు.