Telangana | స్పెషల్ టాస్క్ బ్యూరోహైదరాబాద్, ఆగస్టు 8, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. చివరి విడత అసెంబ్లీ సమావేశాలను విజయవంతంగా ముగించుకొన్న అధికార పక్షం బీఆర్ఎస్, సభా వేదికనుంచే పలు ప్రధానమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రకటించడం ద్వారా ఎన్నికల సమర భేరీని మోగించింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పాదయాత్రలు, సభలు, సమావేశాలతో హడావిడి చేస్తున్నప్పటికీ అధికార పార్టీని ఎదుర్కొనే వ్యూహాన్ని, సత్తాను మాత్రం ప్రదర్శించలేకపోతున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రెండుమార్లు ప్రజాభిమానాన్ని చూరగొన్న బీఆర్ఎస్ మరోసారి అదే ఉత్సాహంతో దూసుకుపోయేందుకు సిద్ధమవుతుండగా.. ప్రజలను ఆకట్టుకొనేందుకు సరైన ఎన్నికల నినాదం లేక, తమ విధానాలతో ఆకర్షించలేక ప్రతిపక్షాలు సతమతమవుతున్నాయి. దీంతో బీఆర్ఎస్కు రెండు ప్రతిపక్ష పార్టీలలో ఏ ఒక్కటైనా సమ ఉజ్జీగా నిలువగలదా? అంటూ రాజకీయ పరిశీలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలలో అధికార పార్టీ అందరికన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించింది.
ఈ సారి కూడా అదే ఒరవడిని కొనసాగించనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికకు పాలకపక్షానికి ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు, ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం ఇద్దరు లేదా ముగ్గురు నేతలు టికెట్ ఆశిస్తున్నవారున్నారు. గతానికి కంటే ఈ సారి ఎక్కువ సీట్లు గెలుచుకోబోతున్నట్టు అసెంబ్లీ సాక్షిగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ఎన్నికల బరిలో దింపడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితి కనిపిస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత టికెట్ దక్కని నేతలు ఎవరైనా తమ వైపు రాకపోతారా? అన్న ఆశతో బీజేపీ, కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తున్నది.
పెండింగ్ పనులు వేగవంతం
ఎన్నికల సన్నాహాలను ప్రారంభించిన బీఆర్ఎస్ మరోవైపు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేస్తున్నది. పోడు భూములకు పట్టాల పంపిణీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అప్పగింత, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, బీసీ కులవృ త్తులవారికి, మైనార్టీలకు రూ.లక్ష నగదు సాయం, రైతులకు పంట రుణమాఫీ, ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికల విలీనం వంటి చర్యలు జరిగిపోతున్నాయి. ప్రభు త్వ ఉద్యోగులకు త్వరలోనే వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) వేయబోతున్నట్టు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పీఆర్సీ ఇస్తామని, అప్పటివరకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇచ్చిన హామీలలో ఇంకా ఏ వైనా పెండింగ్‌లో ఉంటే వాటిని కూడా త్వరగా పూర్తి చేయడంపై పాలకపక్షం దృష్టి సారించింది. నియోజకవర్గాలవారీగా పురోగతిలో, పెండింగ్‌లో ఉన్న వాటి ని ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపే యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని అనేక పథకాలను అమలుచేస్తూ.. ఎవరూ ఊహించని ఆర్టీసి విలీనం వంటి సంచలన నిర్ణయాలతో అధికార పార్టీ దూసుకుపోతుండంతో ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయి.
ప్రభుత్వాన్ని ఏమని విమర్శించాలో తెలియని స్థితిలో విపక్షాలు కొట్టుమిట్టాడుతున్నాయి. పంట రుణ మాఫీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్, బీజేపీలు అధికార పార్టీపై విమర్శలు చేశాయి. తాము అధికారంలోకి వస్తే రుణ మాఫీ చేస్తామని హామీలు గుప్పించాయి. వారు ఉహించని విధంగా లక్ష రూపాయల రుణమాఫీ ప్రక్రియ అసెంబ్లీ సమావేశాల ప్రా రంభానికి ముందే ప్రారంభించడంతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. దీనిపై ఏ విధం గా స్పందించాలో కూడా అర్థం కాని పరిస్థితిలో తాము గతంలో డిమాండ్ చేయడం వల్లనే రుణ మా ఫీ జరిగిందంటూ కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నది.
ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్‌గా మారింది. పెండ్లికీ, తద్దినానికి ఒకే మంత్రం అన్నట్టు, ఇది కూడా తమ చలవే అన్నట్టు కాంగ్రెస్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. నిజానికి అధికార బీఆర్ఎస్ తమకు ఎన్నికల నినాదం లేకుండా చేస్తున్నదని కాంగ్రెస్, బీజేపీ తమ అంతర్గత సమావేశాలలో వాపోతున్నట్టు సమాచారం. హామీలన్నింటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, ప్రతిపక్షాల ఊహకు కూడా అందని రీతిలో హ్యాట్రిక్ దిశగా బీఆర్ఎస్ దూసుకుపోతుండటంతో.. ఎన్నికల యుద్ధం ఏకపక్షంగా ఉండబోతున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
బీజేపీలో చల్లారని కుంపటి
అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికల హడావుడి చేసిన బీజేపీ తీరా అవి సమీపించే సరికి డీలా పడిం ది. పార్టీలో గ్రూపు తగాదాలు పరాకాష్టకు చేరాయి. కర్ణాటకలో ఓటమి తెలంగాణలో ఆ పార్టీని తీవ్రంగా కుంగదీసింది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ని మార్చితే తప్ప పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని ఒక వర్గం, బండి వచ్చాకే పార్టీ బలపడిందని మరో వర్గం రెండు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ ఢిల్లీ పెద్దలు బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడంతో బండి వ్యతిరేక వర్గం పైచేయి సాధించినట్టయ్యింది.
కొత్త అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి బండి వర్గం ఏ మేరకు సహకరిస్తుందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బండిని తొలగించడం పట్ల కినుక వహించిన సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఏ చంద్రశేఖర్, యెన్నం శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి ప్ర ధాని మోదీ హన్మకొండ పర్యటనకు వచ్చినప్పుడు.. గైర్హాజరు అయ్యారు. కిషన్‌రెడ్డి పదవీ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన సమైక్యవాది, మాజీ సీఎం కే కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎలా ఆహ్వానిస్తారంటూ విజయశాంతి బాహాటంగానే నిరసన తెలిపి కార్యక్రమాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. పచ్చి సమైక్యవాది కిషన్‌రెడ్డిని రాష్ట్ర అధ్యక్షునిగా ఎలా నియమిస్తారని జిట్టా బాలకృష్ణారెడ్డి నిలదీయడంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ప్రధాని కార్యక్రమాన్ని బహిష్కరించిన నేతలు పార్టీతో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. వీరంతా పార్టీకి త్వరలో గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఈ రెండు గ్రూపుల మధ్య అధిపత్యపోరుతోనే వేగలేక సతమతమవుతున్న అధిష్ఠానం అభ్యర్థుల ఎంపికపై ఇంకా దృష్టి సారించలేకపోతున్నది. పదాధికారులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో సహా సిట్టింగ్ ఎంపీలు అందరూ అసెంబ్లీ బరిలోకి దిగాల్సిందేనని పార్టీ అగ్రనేత అమిత్ షా ఇటీవల ఆదేశించినట్టు తెలిసింది. వీరందరిని బరిలోకి దింపినా 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు మించి అభ్యర్థులు లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్కు బీజేపీ ఏ మేరకు పోటీనివ్వగలదన్నది సందేహాస్పదంగా మారింది.
ఆత్మరక్షణలో కాంగ్రెస్
అధికార బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయ మని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికలలో తమ నినాదం ఏమిటో తెలియని దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయానికి 24 గం టల ఉచిత విద్యుత్తు అవసరం లేదు.. మూడు గం టలు సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనతో ఉన్న కొద్ది ఆశలు కూడా ఆవిరిపోయినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో కొద్దోగొప్పో ఉన్న సానుకూలత కూడా రేవంత్ప్రకటనతో కొట్టుకుపోయిందని పార్టీ నేతలు వాపోతున్నారు. తాము అధికారంలోకి వస్తే రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తూ వచ్చింది.
ఈలోగానే రైతుల పంట రుణాల హామీని నెరవేరుస్తున్న ట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఫీజులు ఎగిరిపోయాయి. తాము అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం అమలు చేసిం ది. ఎన్నికల హామీలుగా ఇంతకాలం తాము ప్రకటిస్తూ వచ్చిన వరాలన్నింటినీ ఒక్కోక్కటిగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుండటంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిపోయింది. మరోవైపు పార్టీలో సీనియర్లు, జూనియర్ల గొడవ ఎడతెగని పంచాయితీగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ ర్గాలుగా చీలిపోయింది.
పార్టీలో మేము కూడా ఉ న్నామంటూ అడపాదడపా సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కి, జగ్గారెడ్డి వంటి నాయకులు వివాదాస్పద ప్రకటనలు చేస్తూ పార్టీని ఇరుకున పెడుతున్నారు. ముగ్గురు నాయకులు, ఆరు గ్రూపులుగా మారడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అయోమయంలో పడ్డారు. ఈ గొడవలతో పార్టీ గెలిచే పరిస్థితి కాదుకదా, కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకుంటుందా? అన్న అనుమానం వ్యక్తమవుతున్నది. దీనికి తోడు నెహ్రూ మొదలు ఇందిరాగాంధీ వరకు తెలంగాణకు కాం గ్రెస్ పార్టీ ద్రోహం చేసిందన్న సీఎం కేసీఆర్ వ్యా ఖ్యలు.. తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ గత చరిత్రపై చర్చను లేవదీశాయి. అధికారంలోకి రాకముందే సాగుకు ఉచిత విద్యుత్తును, ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ చేసిన ప్రకటనలు, గతంలో తెలంగాణ పట్ల ఆ పార్టీ వ్యవహరించిన తీరు ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను కలిగిస్తున్నది. దీంతో బీఆర్ఎస్ విజయం ఏకపక్షం అయ్యే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.