హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మిర్చి రైతులకు బీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది. వారికోసం శాసనమండలి ఆవరణలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మండలి సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం మెడలో మిర్చిదండలు వేసుకొని మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సత్యవతి రాథోడ్, నవీన్‌కుమార్, తాతా మధు, మహమూద్ అలీ, నవీన్‌కుమార్‌రెడ్డి, వాణీదేవి, దేశపతి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిర్చికి మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడులు దక్కవనే ఆందోళనతో రెండు నెలలుగా రైతులు ఆందోళన చేస్తుంటే.. ప్రభుత్వం వారి సమస్యను పట్టించుకోలేదని విమర్శించారు. మిర్చికి క్వింటాల్‌కు రూ.25 వేల మద్దతు ధర కల్పించి నాఫెడ్, మార్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, రాష్ట్రంలో మిర్చి బోర్డు ఏర్పాటుచేయాలని, మిర్చిని సుగంధద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
రేవంత్ దగాకోరు పాలనతోనే సమస్యలు
సీఎం రేవంత్‌రెడ్డి దగాకోరు పాలనతోనే రైతులు సమస్యలు ఎదురొంటున్నారు. కేసీఆర్ పాలనలో రైతులు గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోతే.. నేడు ఎకడ చూసినా రైతుల హాహాకారాలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వస్తే క్వింటాల్ మిర్చి రూ.16 వేలకు కొంటామని చెప్పి, ఇప్పుడు వాళ్లను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి రైతాంగంపై చిత్తశుద్ధి ఉంటే మిర్చి రైతులకు మద్దతు ధర ప్రకటించాలి.
– సిరికొండ మధుసూదనాచారి, మండలిలో ప్రతిపక్ష
నేత ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
మిర్చి పంటకు మద్దతు ధరతోపాటు కరెంట్, సాగునీరు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏ ఒక్క మంత్రి కూడా వచ్చి మిర్చి మారెట్ను సందర్శించలేదు. మిర్చి రైతులను ఆదుకునేందుకు వెంటనే రాష్ట్రంలో మిర్చి బోర్డు ఏర్పాటుచేయాలి. క్వింటాల్‌కు రూ.16 వేల చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
– తాతా మధు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ