మెదక్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనపై ప్రజలతోపాటు ఆ పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అభివృద్ధి, సంక్షేమాన్ని మరచిపోయిందని విమర్శించారు. అందుకే ఆ పార్టీ నాయకులంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాత్రావు శుక్రవారం హైదరాబాద్‌లో హరీశ్‌రావు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సుప్రభాత్రావు 25 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో పనిచేశారని అన్నారు.
ఆయన ఎన్ఎస్యూఐ నుంచి పీసీసీ కార్యదర్శిగా పనిచేశారని, తెలంగాణ ఉద్యమం సమయంలోనూ నమ్మిన పార్టీకి అన్యాయం చేయకుండా కాంగ్రెస్‌ను వీడలేదని చెప్పారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూసి ఆయన పార్టీని వీడినట్టు తెలిపారు. రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో రామాయంపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధ్దిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. పీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాత్రావు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుకు స్వయాన తోడల్లుడు అవుతారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి హన్మంత్‌రావు కుమారుడు మైనంపల్లి రోహిత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. సుప్రభాత్రావు పార్టీని వీడటం కాంగ్రెస్‌కు నియోజకవర్గంలో పెద్దనష్టంగా ఆ పార్టీ క్యాడర్ భావిస్తున్నది.