ధర్మపురి : అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చిరునామాగా నిలుస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి పట్టణంలో గురువారం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు.
దేవస్థానం అభివృద్ధికి రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయించగా రూ. 70 కోట్లతో పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. పేద ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిస్తున్నారని అన్నారు.
స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారంతో ధర్మపురి జూనియర్ కళాశాల మైదానం నిర్వహించిన ఎమ్మెల్యే రోలింగ్ క్రికెట్ టోర్నీని మంత్రి ప్రారంభించారు. దాదాపు 50 రోజుల పాటు జరిగే టోర్నమెంట్లో క్రీడాకారులు సోదరభావంతో మెలిగి గెలుపు, ఓటములను సమానం స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేత, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లా శ్రీకాంత్ రెడ్డి , జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.