వికారాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఎనుముల బ్రదర్స్ అన్ని భూములనూ మింగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘తిరుపతిరెడ్డి ఓదిక్కు, కొండల్‌రెడ్డి ఓదిక్కు, కృష్ణారెడ్డి ఓదిక్కు, ఇంకో రెడ్డి ఇంకో దిక్కు ఇట్ల నలుగురూ నాలుగు దిక్కుల తగిలి రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులే మొత్తం భూములు మింగుతుంటే ఇక రియల్ ఎస్టేట్ ఏం మిగులుతది?’ అని దుయ్యబట్టారు. ఆదివారం నిర్వహించిన వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సభ్యత్వ నమోదు, ‘సర్’పై పార్టీ శ్రేణులకు కేటీఆర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం ఆగమైందని, దానిమీద ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది జీవితాలను రేవంత్‌రెడ్డి కుటుంబం ఛిద్రం చేసిందని మండిపడ్డారు. దుర్యోధనుడు రేవంత్‌రెడ్డి చేసే దుర్మార్గాలు స్పీకర్‌కు కనిపిస్తలేవని, ఆయన పరిస్థితి ధృతరాష్ర్టుడిలా మారిందని ఎద్దేవాచేశారు. ‘భయపడితే నడువదు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చుడు పక్కా.. 2028 నవంబర్, డిసెంబర్లో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం పక్కా.. ఇందులో ఎవరికీ అనుమానం అక్కర్లేదు’ అని తేల్చిచెప్పారు. ‘రేవంత్‌రెడ్డికి కూడా ఈ విషయం తెలుసు.. ప్రసాదన్నకు కూడా తెలుసు. అందుకే స్కీమ్ పెట్టుకొని అందినకాడికి దోచుకుంటున్నరు’ అని మండిపడ్డారు.
అప్పులపై సిగ్గులేకుండా అబద్ధాలు
‘ప్రజలు ఆగమాగమై ఓట్లు వేస్తే గెలిచిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఏ ఊరుకు వెళ్లినా కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయిండని అబద్ధాలు చెప్తున్నారు. ‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి నోటికి ఎంత వస్తే అంత అబద్ధా లు, సత్యదూరమైన మాటలు మాట్లాడితే మీ గౌరవం తగ్గుతది తప్ప పెరుగదు’ అని హితవు పలికారు. ఆర్బీఐ, కాగ్ లెక్కలతో తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ చేసిన అప్పు రూ.2.80 లక్షల కోట్లు అని నిండు పార్లమెంట్ వేదికగా కేంద్రమే చెప్పిందని గుర్తుచేశారు. ‘తెలంగాణ ఏర్పడిన సమయంలో అప్పు రూ.72 వేల కోట్లు ఉంటే 2023 డిసెంబర్ 3 నాటికి రూ.3.52 లక్షల కోట్లకు చేరింది. ఏడాదికి సగటున రూ.28 వేల కోట్ల అప్పు అని కేంద్రమే చెప్పింది. కానీ స్పీకర్ రూ.8 లక్షల కోట్లు, డిప్యూటీ సీఎం రూ.9 లక్షల కోట్లు, ఇంకొకాయన రూ.10 లక్షల కోట్లు అని సిగ్గులేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నరు’ అని ధ్వజమెత్తారు.
కేసీఆర్ అప్పు చేసి ఇవన్నీ చేసిండు
‘అవును కేసీఆర్ అప్పులు చేసి రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2 వేలు చేసిండు. 46 లక్షల మంది గరీబోళ్లకు ఆసరా అయిండు. 14 లక్షల మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి రూ.లక్ష ఇచ్చి మేనమామలా నిలిచి పెండ్లిండ్లు చేసిండు. 15 లక్షల మంది ఆడబిడ్డలకు ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు ఇచ్చి పెద్దదిక్కు అయిండు. 1,022 గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు పెట్టి దాదాపు 7 లక్షల మంది పిల్లలకు చదువు చెప్పించిండు. దశాబ్దాల వికారాబాద్ జిల్లా కలను నిజం చేసి కలెక్టర్, ఎస్పీని ఇక్కడ కూర్చోబెట్టిండు. అద్భుతమైన కలెక్టరేట్ కట్టించిండు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఒక్క మెడికల్ కాలేజీ లేని పరిస్థితి నుంచి రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ సహా మొత్తం 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు కట్టించిండు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు డాక్టర్లయ్యే అవకాశం కల్పించిండు. కరెంట్ ఇయ్యక మీరు సతాయిస్తుంటే రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కొత్త సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టి రైతులకు 24 గంటల కరెంటిచ్చిన మొనగాడు కేసీఆర్’ అని కొనియాడారు. ‘మీరు తెలంగాణను అంధకారంలో విడిచిపెట్టి పోతే కేసీఆర్ వెలుగులు నింపిండు. 72 లక్షల రైతుల ఖాతాల్లో 11 సార్లు రూ.73 వేల కోట్లు వేసిన నాయకుడు దేశ చరిత్రలో ఒకే ఒక్కడు కేసీఆర్’ అని గుర్తుచేశారు. ‘మీరొచ్చి రెండున్నరేండ్లయ్యింది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అంటిరి. అటున్న చంద్రుడిని ఇటు పెడుతామంటిరి.. ఏమైంది మరి? నూరు రోజుల్లో విద్యా భరోసా కార్డు, రైతు భరోసా ఇచ్చిండ్రా? మహిళలకు రూ.2,500 ఒక్కరికైనా ఇచ్చిం డ్రా?’ అని నిలదీశారు. ‘చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభ పెట్టి కేసీఆర్ రూ.10 లక్షలు ఇస్తుండు మేం రూ.12 లక్షలు ఇస్తమంటిరి. అంబేద్కర్ అభయహస్తమని రూ.12 పైసలైనా ఇచ్చిండ్రా?’ అని ప్రశ్నించారు.

మూసీకి ఉరివేసే కుట్ర
కాంగ్రెస్-బీజేపీ కలిసి మూసీకి, దామగుండం అడవికి ఉరి వేసే ప్రయత్నం చేస్తున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మూసీని బాగు చేస్తామనేవాళ్లు మూసీ జన్మస్థలంలో 12 లక్షల చెట్లను కొట్టేస్తరా? భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే వాళ్లు ఇట్లా చేస్తరా? నది పుట్టిన కాడ చంపేసి మూసీ సుందరీకణ చేస్తామనడం అంటే కమీషన్ల కోసమేనని తెల్వదా?’ అని దుయ్యబట్టారు. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ కడుతాం, 2 వేల ఎకరాలివ్వాలని కేసీఆర్ మెడపై మోదీ కత్తిపెట్టారని, అయినా నాడు ఇవ్వలేదని గుర్తుచేశారు. 12 లక్షల చెట్లు కొట్టేస్తున్నారని కేసీఆర్ ఒప్పుకోలేదని పేర్కొన్నారు. కానీ ఇవ్వాళ దామగుండంలో రాడార్ కేంద్రం కోసం కేంద్రం ఒక్క మాట అడిగిన వెంటనే రేవంత్‌రెడ్డి ఒప్పకొన్నా డని, గట్టిగా మట్లాడితే మోదీ బెయిల్ రద్దు చేసి జైలులో వేస్తాడన్న భయంతో 2 వేల ఎకరాలను అప్పజెప్పాడని మండిపడ్డారు. సమావేశంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గట్టు రాంచంద్రారావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, పంజగుల శ్రీశైల్‌రెడ్డి, రాజుగౌడ్ పాల్గొన్నారు.
పదేండ్లు దొరికిన యూరియా ఇప్పుడెందుకు లేదు?
‘వెనుకటికి ఎవరో తన ముఖం బాగాలేక అద్దం పగులగొట్టినట్టు కాంగ్రెస్ పరిపాలన ఉన్నది’ అని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘కేసీఆర్ సీఎంగా ఉన్న తొమ్మిదిన్నరేండ్లలో యూరియా ఎట్ల దొరికింది? కాంగ్రెస్ రాంగనే రైతులు యూరియా కోసం మళ్లీ లైన్లు ఎందుకు కడుతున్నరు? యూరియా ఇచ్చే తెలివి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదా?’ అని నిలదీశారు. ‘దగుల్బాజీ, దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. హామీలేవీ అంటే ‘రాష్ట్రం అప్పుల పాలైంది మేమేం చేస్తమంటున్నరు’ అంటూ దుయ్యబట్టారు.
కేసీఆర్‌కు పేరొస్తదనే పాలమూరు పడావు
వికారాబాద్, చేవెళ్ల, పరిగి, తాండూర్ రైతులకు సాగునీరు అందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టి, కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు వేసినా భయపడకుండా 90 శాతం పను లు పూర్తి చేశామని కేటీఆర్ తెలిపారు. రిజర్వాయర్లన్నీ పూర్తయ్యాయని, కేవలం ఒక రిజర్వాయర్‌ను ప్రారంభించి, పంపులు నడిపే పనులే మిగిలి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, ప్రాజెక్టును త్వరగా పూర్తిచేస్తే కేసీఆర్ పేరొస్తదనే ఈర్ష్యతో రేవంత్ ప్రభుత్వం ప్రాజెక్టును పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో రియల్ ఎస్టేట్ మొత్తం ఆగమైంది. దానిమీద ఆధారపడి బతుకుతున్న లక్షల మంది జీవితాలను రేవంత్ రెడ్డి కుటుంబం ఛిద్రం చేసింది. నాడు భూములు ఎంత ధరకు పోతుండె? రియల్ ఎస్టేట్ ఎట్లుండెనో నాకంటే మీకే బాగా తెలు. మార్పు బాగున్నదా? వికారాబాద్‌లో రియల్ ఎస్టేట్ చేసేటోళ్లు చెప్పాలె. భూముల ధరలు కిందైనయా? లేదా? ఆలోచించాలె. -కేటీఆర్
స్పీకర్ పరిస్థితి ధృతరాష్ర్టుడిలా మారింది. దుర్యోధనుడైన రేవంత్‌రెడ్డి చేసే దుర్మార్గాలు ఆయనకు కనిపిస్తలేవు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది పార్టీ మారినా.. వారిలో ఒకాయన కాంగ్రెస్ బీ ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసినా స్పీకర్‌కు కనిపిస్తలేదు. వాళ్లు కాంగ్రెస్ కండువాలు వేసుకున్నా కనిపిస్తలేదు..జై కాంగ్రెస్ అన్నదీ కనిపిస్తలేదు. చేయి గుర్తుకు ప్రచారం చేసిందీ కనిపిస్తలేదు. అట్లనే వికారాబాద్ రోడ్ల మీద ఉన్న గుంతలు కూడా స్పీకర్‌కు కనిపిస్తలేవు.-కేటీఆర్