హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలోని వేలాది గీత కార్మికులకు నీరా ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలని, కల్తీలేని కల్లు, స్వచ్ఛమైన నీరాను రాష్ట్ర ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో రూ.12 కోట్లతో నీరా ప్రాసెసింగ్ యూనిట్‌ను నిర్మించింది. అందుకు కావల్సిన ఆధునిక యంత్రసామగ్రిని గత ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ ప్రాజెక్టును పూర్తి చేసే క్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు కోడ్ రావడం, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో, దానిని పట్టించుకున్న దిక్కు లేకుండా పోయింది. దీంతో కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన యంత్రాలు, ఇతర సామగ్రి తుప్పుపట్టిపోతున్నాయి. ఆ ప్రాజెక్టు ఎలా ఉన్నది? దానిపై పెట్టిన ఖర్చు నుంచి లాభాలు తీసుకోవడం ఎలా? దాని ద్వారా ఎన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది? తద్వారా ప్రభుత్వానికి ఎంత మంచి పేరు రానున్నది? అనే విషయాలేవీ ఈ ఏడాదిన్నర కాలంలో పట్టించుకున్న దిక్కు లేదు. ఇటు ఎక్సైజ్‌శాఖ అధికారులు, మంత్రులు నందనం నీరా ప్రాసెసింగ్ యూనిట్‌పై దృష్టిపెట్టకపోవడం వల్లనే యంత్రాలు తుప్పు పట్టిపోతున్నాయని నందనం పరిసర ప్రాంతాల్లోని కల్లుగీత కార్మికులు చెప్తున్నారు.
నందనంలోని నీరా ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి వస్తే, అన్ని మండల హెడ్ క్వార్టర్స్‌లో నీరాకేఫ్‌లు ప్రారంభించి, వాటి ద్వారా స్వచ్ఛమైన నీరాను రాష్ట్ర ప్రజలకు అందించాలనేది గత ప్రభుత్వ లక్ష్యం. దీని ద్వారా కల్తీ కల్లును నివారించి, అవసరమైతే స్వచ్ఛమైన కల్లును గౌడన్నల ద్వారానే విక్రయించాలనే ఆలోచన కూడా చేసింది. గత ప్రభుత్వం అనుకున్నట్టుగా నందనం నీరా ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి వస్తే, రాష్ట్రవ్యాప్తంగా గీతకార్మికులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించేది. ఒక్కో గీత కార్మికుడు నెలకు ఒక్క నీరా సేకరించడం వల్లనే రూ.30-40వేలు సంపాదించుకునే అవకాశం ఉన్నది. నీరాకు తోడు గీత కార్మికులు కల్లు అమ్ముకుంటే, నెలకు ప్రత్యక్షంగా కనీసం రూ.50వేలు సంపాదించుకుని ఆర్థికంగా స్థిరపడేలా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలోనే భువనగిరి జిల్లాలోని నందనం వద్ద, రంగారెడ్డి జిల్లా ముద్విన్, సంగారెడ్డి జిల్లా మునిపల్లి, నల్లగొండ జిల్లా సర్వేల్లో నీరా సేకరించే కేంద్రాలను ఎంపిక చేసి, కొంత నిధులను మంజూరు చేశారు. వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం.
గత ప్రభుత్వం నీరా పాలసీ తీసుకొచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లా చరికొండలోని నీరా సేకరణ కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. నీరా చెట్టు నుంచి తీసిన తర్వాత మూడు రోజులపాటు నిల్వ ఉంచడం కోసం చేసిన ప్రయోగాలన్నీ విజయవంతం అయ్యాయి. దీంతో చరికొండ నుంచే ప్రస్తుతం నీరా సేకరిస్తున్నారు. ఆ నీరాను ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌లోని నీరాకేఫ్‌కు తరలించి ప్యాకింగ్ చేయించి విక్రయిస్తున్నారు. దీంతో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కల్లు గీత కార్మికులకు నీరా సేకరణ ఆదాయ వనరుగా మారింది. తద్వారా ఎంతోమంది కల్లుగీత కార్మికులు నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నారు. దీనికితోడు కల్లు అమ్ముకుంటున్న వారికి నెలకు సుమారు రూ.40 వేల వరకు లాభం చేకూరుతుందని అంటున్నారు.
గత ప్రభుత్వం కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన నందనంలోని నీరా ప్రాసెసింగ్ యూనిట్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించి, దానిని ఉపయోగంలోకి తీసుకురావాలి. ఇప్పటికే ప్రభుత్వం కల్లుగీత కార్మికులపై చిన్నచూపు చూస్తున్నది. వేలాది గీత కార్మికులకు మేలు చేసే పనిని తక్షణం చేపట్టాలి. కోట్లాది రూపాయల విలువైన యంత్రాలు తుప్పు పట్టిపోతుంటే, ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోవడం దారుణం. ఇది ముమ్మాటికీ గౌడన్నల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడమే.