హైదరాబాద్, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించిందని, దళితబంధు సహా అనే పథకాలను అమలు చేసి చూపిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ఆ పథకాలను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగించాలని, అప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని సూచించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుడికి కేసీఆర్ నివాళి అర్పించారు.
ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ తొలి ప్రభుత్వం అమలుచేసిన పథకాలు.. పదేండ్ల కాలంలోనే సత్ఫలితాలనిచ్చాయని తెలిపారు. పరిపాలనలో అంబేదర్ స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టుకున్నామని గుర్తుచేశారు. అంటరానితనం, సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలకు సమాన వాటాకోసం, సామాజిక న్యాయం కోసం తన జీవితకాలం పోరాడిన దార్శనీకుడని కొనియాడారు.
ముందుచూపుతో రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. భారతజాతి గౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలిపిన ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించేందుకు, ప్రపంచంలో మరెకడాలేని విధంగా 125 అడుగుల అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహ రూపాన్ని రాష్ట్రంలో నిలుపుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు.