హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత విచ్చలవిడిగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సిట్ విచారణకు పిలవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నదని, మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నట్టు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని చెప్పారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డిపై సిట్ అధికారులకు ఫిర్యాదుచేసినట్టు వెల్లడించారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన 243/2024 కేసుకు సంబంధించి తన వాంగ్మూలాన్ని సోమవారం ఆయన సిట్ అధికారులకు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 అబద్ధపు హామీల అమలు కోసం బీఆర్ఎస్ వీరోచిత పోరాటం చేస్తున్నది. హామీలను అమలుచేయడం చేతగాక రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిట్‌ను వాడుకుంటున్నదనే విషయాన్ని సిట్ అధికారులకు చెప్పాను’ అని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
విచ్చలవిడి ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు
మంత్రులతోపాటు వ్యాపారవేత్తలు, ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్లను కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా ట్యాప్ చేస్తున్నట్టు సౌత్‌ఫస్ట్ ప్రచురించిన కథనాన్ని సాక్ష్యంగా జత చేసి సిట్ అధికారులకు ఫిర్యాదుచేసినట్టు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా.. డార్క్‌వెబ్‌లో అత్యంత ఆధునిక, ఖరీదైన సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతూ తన సొంత మంత్రుల మొబైళ్లను హ్యాక్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మంత్రులతోపాటు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కూడా హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి చేసే ఫోన్ ట్యాపింగ్‌కు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు కూడా ఉన్నదని విమర్శించారు.
మంత్రులను సిట్‌కు పిలిపించి విచారించాలి
ఫోన్ ట్యాపింగ్ ఎదుర్కొంటున్న మంత్రులను సిట్ అధికారులు పిలిచి క్షుణ్ణంగా విచారణ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కోరారు. ‘బాధిత మంత్రులను సిట్ ఆఫీసుకు పిలిపించి.. వారి ఫోన్ల మీద కూడా ఫోరెన్సిక్ ఎగ్జామిన్ చేయాలి. మంత్రుల ఫోన్లలోకి ఏ విధంగా మాల్వేర్ పంపించారనేది పూర్తిగా ఎగ్జామిన్ చేయాలి’ అని సిట్ అధికారులను కోరినట్టు వెల్లడించారు. గతంలో తన ఫోన్‌ను స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ హ్యాక్ చేస్తున్నారని ఆపిల్ నుంచి మెసేజ్ వస్తే.. దాని ఆధారంగా నాటి కమిషనర్‌కు ఫిర్యాదుచేసినట్టు ఆర్ఎస్పీ చెప్పారు. ఆ ఫిర్యాదు ఏమైందని కూడా తాను సిట్ అధికారులను అడిగనట్టు తెలిపారు. ‘నేను ఆపిల్ నుంచి వచ్చిన మెసేజ్‌ను నాటి సీపీకి ఇచ్చాను. ప్రస్తుతం నన్ను పిలిచింది 243/2024 పంజాగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైన కేసు కోసం. దాంతోపాటు నేను రేవంత్‌రెడ్డి చేస్తున్న విచ్చలవిడి ఫోన్ ట్యాపింగ్‌పై కూడా సిట్ అధికారులకు ఫిర్యాదు చేశాను’ అని వివరణ ఇచ్చారు.
ఫోన్‌ట్యాపింగ్‌కు బీఆర్ఎస్కు సంబంధం లేదు
బీఆర్ఎస్కు ఎప్పుడూ ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టంచేశారు. కేసీఆర్ ప్రజలను నమ్ముకొని, ప్రజల గొంతుకై తెలంగాణ తీసుకొచ్చారని, ఆ పదేండ్లు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పాలన చేశారని, పోలీసులపై ఆధారపడి పాలన చేయలేదని తాను సిట్‌కు స్పష్టంచేసినట్టు తెలిపారు. ఒకవేళ ఎవరైనా అధికారులు తప్పుచేసుంటే, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని సిట్‌ను కోరినట్టు వెల్లడించారు. సిట్‌కు ఇచ్చిన ఫిర్యాదును త్వరలో హైదరాబాద్ సీపీకి కూడా ఇస్తామని, పూర్తిస్థాయి విచారణ జరిపే వరకూ ప్రభుత్వంపై పోరాడతామని చెప్పారు.