హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ):రాబోయే 40-50 సంవత్సరాల వరకు తెలంగాణలో విద్యుత్తు, తాగునీటి సమస్య లేకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లు తీర్చిదిద్దారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కొనియాడారు. తెలంగాణను ఐటీ రంగంలో ప్రపంచపటంలో నిలబెట్టారని పేర్కొన్నారు. శాసనమండలిలో శనివారం జీరోఅవర్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో హైదరాబాద్ నగర అభివృద్ధికి ఎలాంటి మాస్టర్‌ప్లాన్ లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించలేకపోతున్నామని చెప్పారు. పెట్టుబడుదారులకు విశ్వాసం కల్పించడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైందని విమర్శించారు. యూరప్‌కు చెందిన పలు పెద్ద కంపెనీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని, వాటిని హైదరాబాద్ వైపు ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం లేదని పేర్కొన్నారు. ఐదారేండ్ల కిత్రం ప్రతిభ కల్గిన ఐటీ నిపుణులకు బెంగళూరు కేంద్రంగా ఉండేదని, ప్రస్తుతం హైదరాబాద్ ఆ స్థానాన్ని అందిపుచ్చుకున్నప్పటికీ గ్లోబల్ కేపబుల్ సెంటర్(డీసీసీ)లను ఏర్పాటు కావడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలకు అవసరమైన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతంలో కొత్తగా 142 స్లిప్ రోడ్లను గుర్తించి, 90 స్లిప్ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేశారని గుర్తుచేశారు.
ఓఆర్ఆర్-జీహెచ్ఎంసీ విస్తరణకు లింక్ ఏంటి: ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి
ఔటర్ రింగురోడ్డుకు జీహెచ్ఎంసీ విస్తరణకు లింక్ ఏమిటని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ విస్తరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ.. ప్రజాసమస్యలు పరిష్కరించకుండా గ్రామాలను తొలుత మున్సిపాలిటీల్లో కలిపారని, దాని నుంచి తేరుకోకముందే మళ్లీ జీహెచ్ఎంసీలో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ను మెట్రోపాలిటన్ సిటీ చేయాలనే ఆకాంక్షిస్తే మౌలికవసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.