హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై సందడి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవాలను ఏకకాలంలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు (మనకు జూన్ 2, తెలంగాణ రాష్ట్ర అవతరణ తేదీ) డాలస్ నగరంలోని డాక్టర్ పెప్పర్ ఎరినాలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. అమెరికాలోని పలు నగరాల్లో ‘చ లో డాలస్’ అనే నినాదాలతో స్టేజీ మీటింగ్స్ జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఎన్నారైలు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికీ అదే ఉత్సాహం చూపుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ గ్లోబల్ విభాగం ఆధ్వర్యంలో ఖండాంతరాల్లో అదీ అమెరికాలో వేలాది మందితో సభను నిర్వహించడం తొలిసారి. బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై విభాగం నిర్వహించే ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు సైతం ఆయా నగరాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఇప్పటికే అమెరికాలోని పలు నగరాల్లో స్టేజీ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. పార్టీ గ్లోబల్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల, ఎన్నారై సెల్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్, శ్రీనివాస్ తుర్కంటి సమన్వయంతో ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, మంత్రి హోదాలోనూ అనేకసార్లు అమెరికాలో పర్యటించిన సందర్భాల్లో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాలు నిర్వహించామని, ఇప్పుడు డాలస్ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో అమెరికావ్యాప్తంగా ఉన్న తెలంగాణవాదులు ఆయన రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మహేశ్ బిగాల తెలిపారు. డాలస్‌లోని డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణాన్ని తెలంగాణ కళా సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
జూన్1న డాలస్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకకు అమెరికా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ సెల్ స్థానికంగా విస్తృత ప్రజాదరణ ఉన్న కమ్యూనిటీ రేడియోల్లో డాలస్ మీటింగ్‌కు కేటీఆర్ వస్తున్నారంటూ ప్రచారం ప్రారంభించింది. జూన్ 1.. డాక్టర్ పెప్పర్ ఎరినా… బీఆర్ఎస్ బిగ్ గ్యాదరింగ్, వీ మీట్ ఎట్ డాలస్ అంటూ బీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో 52 దేశాల్లోని సోషల్‌మీడియా వేదికలపై ప్రచారం చేస్తున్నట్టు మహేశ్ బిగాల పేర్కొన్నారు.
జూన్ 1న డాలస్‌లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై నిర్వహించే సమావేశానికి అమెరికా సంయుక్త రాష్ర్టాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు తమ కుటుంబసభ్యులతో కలిసి రావాలని యూఎస్ఏ బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై సెల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేశ్ తన్నీరు పిలుపునిచ్చారు. శనివారం వెస్ట్ఫ్రిసో నగరంలో బీఆర్ఎస్ మద్దతుదారులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీ-టాబ్‌కు చెందినవారు తమ సంస్థ నుంచి 1,500 మందికి తగ్గకుండా హాజరవుతామని ప్రకటించారు. కార్యక్రమంలో రాజ్ పడిగల, నవీన్ కానుగంటి, రజనీకాంత్ కొసనం, రాజ్ ఆనందేశి, మనోజ్ ఏనుగంటి తదితరులు పాల్గొన్నారు.