హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తున్నది. ఈ నేపథ్యంలో భూ భారతి చట్టంపై వివిధ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు గుప్పించింది. దీనిపై బీఆర్ఎస్ (BRS) పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. శాసనసభ హక్కులను రక్షించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ శాసనసభా పక్షం కోరింది. డిసెంబర్ 19న (గురువారం) దినపత్రికల్లో చట్టానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిందని, ఆమోదం పొందని బిల్లును చట్టంగా ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని పేర్కొంది. శాసనసభలో చర్చ దశలో ఉన్న బిల్లును చట్టంగా పేర్కొనడంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 ప్రకారం సభా హక్కులకు హాని జరిగిందని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ‘భూ భారతి’తో రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అనేక మార్పులు జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో ‘భూదార్’ నంబర్‌ను కేటాయించనున్నారు. ఇకపై భూ క్రయవిక్రయాలు జరిపే సమయంలో ముందుగా ఆ భూమిని సర్వే చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ‘ఇన్స్టెంట్ మ్యుటేషన్’ను కొ త్త చట్టంలోనూ కొనసాగించారు. క్రయవిక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మ్యుటేషన్ కూడా పూర్తవుతుంది. కానీ, వారసత్వంగా జరిగే భూముల బదిలీ (ఫౌతీ)లో కొత్త నిబంధన తీసుకొచ్చారు. తాసిల్దార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ జరిగినా.. మ్యుటేషన్ చేసే అధికారాన్ని మాత్రం ఆర్డీవోకు అప్పగించారు. నిర్ణీత కాలంపాటు (30 రోజులు) మ్యుటేషన్ చేయకుండా నిలిపివేస్తారు. ఆలోగా ఆ భూమి పై ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే ప్రక్రియ పూర్తి చేస్తారు.
కోర్టు ద్వారా వచ్చే, ఓఆర్సీ, 38-ఈ తదితర మొత్తం 14 రకాల భూమి హకులపై మ్యుటేషన్ అధికారాలను ఆర్డీవోకు కట్టబెట్టారు. ఇప్పటివరకు ధరణి పోర్టల్‌లో మొత్తం 33 మాడ్యూళ్లు ఉండగా.. భూభారతిలో వాటిని 6కు తగ్గించనున్నారు. భూమి పట్టాలో కేవలం రైతు పేరు మాత్రమే ఉండగా.. ఇకపై అనుభవదారు కాలమ్ సహా మొత్తం 11 కాలమ్‌లు ఉంటాయి. పార్ట్-బీ కేసులు పరిష్కారమైనవారి వివరాలను భూ రికార్డుల్లో ఎక్కించి, పాస్ బుక్ ఇచ్చేలా మార్పులు చేశారు. తాసిల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు అధికారం ఇచ్చారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. గ్రామ కంఠం, ఆబాదీలకు హకుల రికార్డును రూపొందిస్తుంది. 2014 వరకు సబ్ రిజిస్ట్రార్ల వద్ద రికార్డుల్లో ఉన్న ‘ప్రభుత్వ భూముల’ వివరాలను ప్రస్తుతం ధరణిలో ఉన్న డాటాతో సరిపోల్చనున్నట్టు ప్రభుత్వం చెప్తున్నది. ఆయా సర్వే నంబర్లలోని భూములన్నింటినీ ప్రభుత్వ భూములుగా పరిగణించి నిషేధిత జాబితాలో చేర్చుతామని తెలిపింది. దీంతో 2014కు ముందు పొరపాటున ప్రభుత్వ భూమిగా నమోదై.. 2014 తర్వాత వివాదం ముగిసి, పట్టాభూమిగా మారిన భూములన్నీ ఇప్పుడు మళ్లీ నిషేధిత జాబితాలోకి చేరనున్నాయి. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన నియమ నిబంధనలను 3 నెలల్లో తీసుకురానున్నారు.