హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదుగుతున్నదని ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి చెప్పారు. ఇందుకు పార్టీలో భారీ చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. గురువారం మహారాష్ట్రలోని కంధార్- లోహలో ఎమ్మెల్యే షకీల్, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే శంకరన్న ధోండ్గే, డాక్టర్ యశ్పాల్ భింగే, సురేశ్ గైక్వాడ్, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, నాగనాథ్ గీసెవాడ్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ మాడల్ దేశమంతా అమలు కావాలంటే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలనే డిమాండ్ వస్తున్నదని చెప్పారు. 26న కంధార్-లోహలో బీఆర్ఎస్ బహిరంగ సభలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో భారీ ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. కంధార్-లోహ సభ విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ గంట సదానందం బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు జీవన్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.