హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అక్రమాలు రోజుకొకటిగా బయటపడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల గొంతు నొకేందుకే సిట్ పేరుతో నోటీసులు ఇస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌పై ఇప్పటికే రెండు చార్జిషీట్లు సిద్ధంచేశారని, వాటిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ టార్గెట్‌గా నోటీసులు ఇస్తున్నారని, చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి తీసుకుంటున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి చట్టం అంటే గౌరవం ఉన్నదని, దేన్నైనా న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. వాస్తవానికి సాయంత్రం 4 గంటల వరకే విచారణ చేయాల్సి ఉంటుందని, కానీ, మాజీ మంత్రి హరీశ్‌రావును 7 గంటలకుపైగా విచారణ చేశారని పేర్కొన్నారు. లాయర్లకు అనుమతి ఇవ్వాలని అడిగితే, సాక్షులకు అవసరంలేదని అంటున్నారని తెలిపారు. అలాంటప్పుడు సాయంత్రం 4 గంటల వరకే విచారణ చెయ్యాలి కదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సొంత చట్టం అమలు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే ఉండదని హెచ్చరించారు.