BRS | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నెల 27న ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 25వ తేదీన నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ఇన్చార్జిలు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన ఈ సభలు జరుగుతాయని, జిల్లా పార్టీ అధ్యక్షులు సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం విస్తృతంగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీ శ్రేణుల నుంచి అద్భుత స్పందన వస్తున్నదని చెప్పారు.
25న ప్రతి నియోజకవర్గంలోని గ్రామాలు, వార్డుల్లో ఉదయమే పండుగ వాతావరణంలో పార్టీ జెండాలను ఎగురవేయాలని, ఆ తర్వాత ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రతినిధులు సభ సమావేశ స్ధలికి చేరుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రోజంతా నిర్వహించే ఈ సభల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని నేతలను ఆదేశించారు. పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించనున్నట్టు చెప్పారు. నియోజకవర్గ ప్ర తినిధుల సభ కనీసం 2500 -3000 మంది తో నిర్వహించాలని కోరారు.
నియోజకవర్గ ప రిధిలోని గ్రామ, వార్డు బీఆర్ఎస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, సింగిల్ విండో చైర్మన్లు, మారెట్ కమిటీ డైరెక్టర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ చైర్మన్లు, పురపాలికల కౌ న్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, పురపాలక సంఘాల చైర్ పర్సన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, నాయకులు ఈ సమావేశాలకు హాజరయ్యేలా సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు కేటీఆర్ తెలిపారు. సమావేశాలకు వచ్చే ప్రతినిధులకు భోజనాలు, ఇతర వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు.
అక్టోబర్ 10న వరంగల్‌లో మహాసభ
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున వరి కోతలు సాగుతుండటం, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సాధారణంగా పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించే భారీ సభ/ విసృ్తతస్థాయి సమావేశాలకు బదులు అక్టోబర్ 10వ తేదీన వరంగల్‌లో మహాసభ నిర్వహించనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.
మే నెలాఖరు వరకు ఆత్మీయ సమ్మేళనాలు
బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ పట్ల పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సమావేశాలను మే నెలాఖరుదాకా కుటుంబ వాతావరణంలో కొనసాగించాలని సూచించారు.
నియోజకవర్గాలకు ఇన్చార్జిల నియామకం
పలు నియోజకవర్గాలకు సీఎం కేసీఆర్ పార్టీ ఇన్చార్జిలను నియమించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఇన్చార్జిగా మర్రి రాజశేఖర్‌రెడ్డి, గోషామహల్‌కు నందకిషోర్ వ్యాస్ బిలాల్, భద్రాచలానికి ఎంపీ మాలోత్ కవితను నియమించారు. వీరు ప్రస్తుతం కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతోపాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణకు బాధ్యులుగా కొనసాగుతారు.
” బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని 27వ తేదీన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహిస్తాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో 300 మంది వరకు ప్రతినిధులు పాల్గొంటారు. సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ సమావేశాన్ని ప్రారంభిస్తారు. సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి, విసృ్తతంగా చర్చించి ఆమోదిస్తారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున వరి కోతలు సాగుతుండటం, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించే భారీ సభ/ విసృ్తతస్థాయి సమావేశాలను నిర్వహించడం లేదు. వాటికి బదులు అక్టోబర్ 10వ తేదీన వరంగల్‌లో మహాసభ నిర్వహిస్తాం.”
-మంత్రి కేటీఆర్
25.04.2023
ఉదయం 10 గంటల లోపు ప్రతి గ్రామం, వార్డులో బీఆర్ఎస్ జెండావిష్కరణ
10 గంటలకు నియోజకవర్గ కేంద్రంలో సభ. 3 వేల మంది వరకు హాజరయ్యేలా చర్యలు
ప్రభుత్వ విజయాలు, పార్టీ కార్యక్రమాలపై రోజంతా చర్చ
27.04.2023
హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ వేడుకలు
ఉదయం పార్టీ జెండాను ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్. అనంతరం జనరల్ బాడీ సమావేశం.
చర్చ అనంతరం పలు తీర్మానాల ఆమోదం
300 మందికి ఆహ్వానం