హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే.. దాన్ని సాధించేవరకు విశ్రమించని మనస్తత్వం సీఎం కేసీఆర్ సొంతం. తెలంగాణ ఉద్యమమైనా.. నీటిపారుదల ప్రాజెక్టులైనా.. పథకాలైనా.. తాను అనుకున్నాడంటే పట్టుబట్టి సాధించడం కేసీఆర్ నైజం. దేశ గతిని మార్చాలన్న సంకల్పంతో భారత రాష్ట్ర సమితిని ప్రారంభించిన కేసీఆర్.. పార్టీని విజయతీరాల వైపు నడిపించేందుకు పూర్తిస్థాయిలో నడుంకట్టారు. తన రాజకీయ అనుభవాన్ని, చాణక్యాన్ని ఉపయోగించారు.
బీఆర్ఎస్ ప్రారంభమే దేశంలో సంచలనం సృష్టించగా, ఆవిర్భావ సభ అదుర్స్ అనిపించుకుంది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించే కార్యక్రమానికి కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్‌తోపాటు పలువురు రైతు సంఘాల నేతలు వచ్చిన విషయం తెల్సిందే. ఇక బీఆర్ఎస్ తొలి సభ నిర్వహణపై అనేక సమాలోచనలు జరిగాయి. ఎక్కడ ఎలా సభ నిర్వహించాలన్నదానితోపాటు ఎవరెవరిని ఆహ్వానించాలన్నదానిపై సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దక్షిణం నుంచి ఉత్తర భారతం వరకు ఉన్న బలమైన నేతలనే సభకు ఆహ్వానించారు. కేరళ సీఎం పినరాయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ను సభకు పిలిచారు.
దేశంలో ఇప్పుడున్న నేతల్లో వీరు అత్యంత ప్రభావశీలురు, సీనియర్ రాజకీయ నాయకులు. వీరంతా ఒకే వేదిక మీదకు రావడం దుర్లభమని సోషల్ మీడియాలో బీజేపీ వర్గాలు ప్రచారం కూడా చేశాయి. వీరిలో ఒకరంటే ఒకరికి పడదని, భిన్నధృవాలని పేర్కొన్నారు. కానీ, వీరందరినీ ఒకే వేదికపై కూర్చోబెట్టారు కేసీఆర్. ఈ అద్భుత దృశ్యం దేశ రాజకీయాల్లో పెనుసంచలనంగా చెప్పవచ్చు. లక్షలాది మంది హాజరైన వేదికపై వీరు కూర్చోవడం.. దేశ రాజకీయాల గురించి, ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి వీరు మాట్లాడిన తీరు దేశంలో చర్చనీయాంశమైంది. ఇంతమంది ఉద్దండులను ఒకేవేదికపైకి తీసుకువచ్చిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కిందని, దేశంలో ఇప్పటివరకు ఇటువంటి అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాలేదని చెప్తున్నారు. ఎన్నికలు లేని సందర్భంలో హేమాహేమీలు ఒకదగ్గర కూడటం రాజకీయ పక్షాలన్నింటినీ ఆలోచనలో పడేసింది. కేసీఆర్ చెప్తున్న రాజకీయాల్లో గుణాత్మక మార్పు గురించి వీరు ఆసక్తి చూపించడంతోపాటు భవిష్యత్తులో బీఆర్ఎస్తో కలిసి నడువాలని వీరు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ విషయాన్ని వీరు సభా వేదిక నుంచే ప్రకటించారు. ఇతర రాజకీయ పార్టీలను అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల్లో రాజకీయ విధ్వంసాన్ని సృష్టిస్తున్న ఈ తరుణంలో బీఆర్ఎస్కు జాతీయస్థాయిలో సంఘీభావం రావడమనేది దేశ రాజకీయాల్లో విస్తృత చర్చకు శ్రీకారం చుట్టింది.
వ్యూహాత్మకంగానే సభాస్థలి
దేశ రాజకీయాల్లో బలమైన మార్పు రావాలని ప్రకటించిన సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ తొలి సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఖమ్మంలో సభ నిర్వహించాలనుకోవడం కూడా వ్యూహాత్మకమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీఆర్ఎస్ ముద్ర బలంగా ఉండాలన్నది దీంట్లో భాగం. ఇక కనీసం 5 లక్షల మందికి తక్కువ కాకుండా ప్రజలు వస్తారని సీఎం అంచనా వేశారు. సీఎం అంచనాలు ఎక్కడా తప్పలేదు. 5 లక్షల మందికిపైగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. సభ కోసం వచ్చిన జనాన్ని చూసి జాతీయ స్థాయి మీడియా కూడా ఆశ్చర్యపోయింది. కేసీఆర్కున్న క్రేజ్‌పై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. దేశంలో బీఆర్ఎస్ సభకు ముందు ఒకలా.. ఆవిర్భావ సభ తర్వాత మరోలా ఉంటుందని చెప్తున్నారు. బుధవారం జరిగిన సభ బీఆర్ఎస్ బలప్రదర్శనగా చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చిన నేతలను, ప్రజలను చూసిన తర్వాత ముమ్మాటికీ రేపటి నుంచి దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణలు మారుతాయని ఓ సీనియర్ రాజకీయ నాయకుడు వ్యాఖ్యనించారు. ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అన్న బీఆర్ఎస్ నినాదానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభించిందనేందుకు ఖమ్మం సభనే సజీవ సాక్ష్యమని చెప్తున్నారు. ఇప్పటివరకు దక్షిణాది నేతలను.. పార్టీలను చిన్నచూపు చూసే నేతల వైఖరి మారుతుందని.. బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనే అన్న అభిప్రాయం కలుగుతుందని చెప్తున్నారు.