Vinod Kumar | హైదరాబాద్ : విభజనకు ముందు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పులకుప్పగా మారిందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. ఏపీ రాష్ట్ర విభజన చట్టం గురించి కూడా సీతారామన్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే పునర్విభజన చట్టం వచ్చింది. ఈ చట్టానికి సీతారామన్‌కు గానీ, ఇప్పటి బీజేపీ ప్రభుత్వానికి గానీ సంబంధం లేదు. తెలంగాణ ప్రజలు, గులాబీ జెండా ఆ చట్టాన్ని సాధించుకున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనను సీతారామన్ చాలా చిన్నచూపుతో మాట్లాడారు. తెలంగాణను 1956లో ఆంధ్రాతో కలిపినపుడే తెలంగాణ మిగులు బడ్జెట్‌తో ఉన్నది. ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్ కూడా తన పుస్తకంలో తెలంగాణ సర్ ప్లస్ బడ్జెట్ అని చెప్పారు. 2014లో కూడా తెలంగాణ ఏర్పడ్డప్పుడు కూడా సర్ ప్లస్ బడ్జెటే. ఏదో కొత్త విషయం చెప్పినట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇది అందరికీ తెలిసిందే. తెలంగాణ అప్పుల కుప్ప కాలేదు నిర్మలా సీతారామన్.. మైండ్ ఇట్ అని వినోద్ కుమార్ హెచ్చరించారు.
అప్పులు తెచ్చి కేసీఆర్ వృథాగా ఖర్చు చేయలేదు.. ఆస్తులు సృష్టించారు. జిల్లా కలెక్టరేట్లు కట్టారు, కాళేశ్వరం కట్టారు, రేవంత్ రెడ్డి రోజూ కూర్చునే పోలీస్ కమాండ్ కంట్రోల్ కేసీఆర్ కట్టలేదా..? కేసీఆర్ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కట్టారు.. అది ఆస్తా..? అప్పా..? కాళేశ్వరం కింద భారీ రిజర్వాయర్లు కట్టాము. సమ్మక్క సారక్క యూనివర్సిటీ తెలంగాణ హక్కు.. ఆ పేరు కూడా కేసీఆర్ పెట్టిందే.. సీతారామన్ చేసిందేమిటి. సీతారామన్ మాటలు చూస్తే నవ్వొచ్చింది. జన్‌ధన్ ఖాతాలు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు తెలంగాణకు తెలంగాణకు ఇచ్చామంటున్నారు.. ఇవి తెలంగాణకే ఇచ్చారా? దేశమంతా ఇచ్చారా? హైవేలు దేశమంతా ఇచ్చారు. తెలంగాణకే ప్రత్యేకంగా ఇచ్చారా..? మెదక్ రైల్వే స్టేషన్ కట్టామని గొప్పలు చెప్పుకున్నారు.. ఎన్నో యేండ్ల తర్వాత అది పూర్తయ్యిందని వినోద్ కుమార్ తెలిపారు.
తెలంగాణ అప్పుల గురించి సీతారామన్ మాట్లాడారు.. మరి గొప్పల గురించి మాట్లడరా..? ఎన్నో రెట్లు పెరిగిన తెలంగాణ తలసరి ఆదాయం, జీఎస్డీపీ గురించి ఎందుకు సీతారామన్ మాట్లాడలేదు. తెలంగాణ సొంత రాబడి ఐదు రెట్లు పెరిగిన విషయం సీతారామన్ ఎందుకు మాట్లాడలేదు. సీతారామన్ రెండు రోజులు తెలంగాణ పర్యటనకు వస్తే ఇక్కడి అభివృద్ధి తెలుస్తుంది. రేవంత్ రెడ్డి తెలంగాణను బద్నామ్ చేస్తున్నట్టే సీతారామన్ నిన్న బద్నామ్ చేసేలా మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను బద్నామ్ చేసే కుట్రను ప్రజలు గమనిస్తున్నారు.. వారి ఆటలు సాగవు. సీతారామన్ వెనక తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నాయి. సీతారామన్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. తెలంగాణకు ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్న అనేక హామీలు పెండింగ్‌లో ఉన్నాయి.. ముందు సీతారామన్ వాటిని పరిష్కరించాలి. తెలంగాణ హ్యాపెనింగ్ స్టేట్ అని సీతారామన్ గుర్తు పెట్టుకోవాలి అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..