Rega Kantha Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత గిరిజన, ఆదివాసీల బతుకులు ఆగమయ్యాయని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎం రేవంత్మాత్రం గప్పాలు కొడుతూ పబ్బం గడపుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విలేకరులతో మాట్లాడారు.
గిరిజనులను ఆదుకుంటాం.. ఆదివాసీలను ఉద్దరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నదని ఎద్దేవా చేశారు. ఆయన చేసింది రవ్వంత.. చెప్పుకొనేది కొండంత అని చురకలంటించారు. నాడు శాంతియుతంగా ఎక్కడా గొడవలు కాకుండా రెండు, మూడు ఎకరాల చొప్పున పోడు పట్టాలు పంపిణీ చేశామని గుర్తుచేశారు. గిరి గూడెలకు భగీరథ కింద మంచినీళ్లు అందించిన మహానుభావుడని కొనియాడారు. కానీ రేవంత్ మాత్రం ఎకరం ఇచ్చి ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. నల్లమల ఖనిజ సంపదపై కన్నేశారమో తెలియదు గానీ మాటిమాటికి నల్లమల పేరు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మాయమాటలు ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ సర్కారుకు బుద్ధిచెప్పేందుకు ఎదురుచూస్తున్నారని హెచ్చరించారు.