Putta Madhu | పెద్దపల్లి : రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బహిరంగ లేఖ రాశారు. మంథని ప్రజలు 40 ఏళ్లు మీ కుటుంబానికి అధికారం ఇస్తే మీరు చేసింది ఏమిటి? అని శ్రీధర్ బాబును పుట్ట మధు నిలదీశారు. ఈ మేరకు మంథనిలోని తన నివాసం రాజ గృహలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ప్రతిపక్ష నాయకునిగా, మంథని మాజీ ఎమ్మెల్యేగా మంథని నియోజకవర్గ ప్రజల తరుపున మీ బాధ్యతలను గుర్తు చేస్తూ రాస్తున్న బహిరంగ లేఖ ఇది అన్నారు. మంథని నియోజకవర్గంలో మీ కుటుంబానికి మంథని ప్రజలు ఇప్పటి వరకు 8 సార్లు అవకాశం కల్పిస్తే మీ కుటుంబం ప్రజలకు తిరిగి ఇచ్చిందేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం మీకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా మీరు మంథని, కాటారంలో ఐటీ కంపెనీలు, రెండు పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తారని ఆశించారని తెలిపారు. కానీ మీరు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత మొదటిసారి అమెరికా వెళ్లిన సమయంలో అక్కడి ఎన్ఆర్ఐలతో సమావేశం ఏర్పాటు చేసి పుట్టిన గడ్డకు ఏదో ఒక మేలు చేయాలని వారిని కోరిన మీరు 40 ఏండ్లు అధికారం ఇచ్చిన కుటుంబం నుండి అమెరికాలో సెటిల్ అయిన మీ అన్నదమ్ములు ఇప్పటి వరకు పుట్టిన గడ్డకు చేసిన సేవ కానీ, సాయం కానీ ఏమిటని ప్రశ్నించారు.
మంత్రిగా నేను బిజీగా ఉన్నా మంథని ప్రజలకు ఎల్లవేళలా నా తమ్ముడు అందుబాటులో ఉంటాడని చెప్పిన మీరు మీ తమ్ముని పేరిట గల ఆరు కంపెనీలు డీఎస్ఆర్ సొల్యూషన్స్, డిటాస్ ల్యాబ్స్, డిటాస్ ఇన్ఫ్రా, స్పైరో ఇన్ఫ్రా, శ్రీపాద టెక్నాలజీస్ డాటా ఫార్మిక్స్లలో మంథని నియోజకవర్గం నుండి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని ప్రశ్నించారు. బెల్లంపల్లి లాంటి మారుమూల నియోజకవర్గంలో అక్కడి స్థానికంగా రెండు సాఫ్ట్వేర్ సంస్థలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తుంటే స్వయంగా సాఫ్ట్వేర్ సంస్థలు కల్గిన మీ కుటుంబం ఇప్పటి వరకు మంథని కేంధ్రంగా గానీ కాటారం కేంధ్రంగా గానీ ఒక్క సాఫ్ట్వేర్ సంస్థనైనా స్థాపించి ఎందుకు మంథని యువతకు ఉపాధి కల్పించలేదన్నారు.
మంథనిలో అట్టహాసంగా ప్రారంభించిన సెంటిలియోన్ సంస్థ ద్వారా ఎంతమంది సాఫ్ట్వేర్ అభ్యర్థులకు ఉద్యోగం కల్పించారన్నారు.
పవన్ కళ్యాన్ లాంటి వ్యక్తి పిఠాపురంలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపడితే ఆయన కుటుంబం స్వంతంగా హాస్పిటల్స్‌తో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మరి మీ కుటుంబానికి 40 ఏండ్లు అధికారం కల్పిస్తే ఒక్క రూపాయి సాయమైనా ఎందుకు చేయలేదన్నారు. మంత్రిగా అయినా మీకున్న అవకాశాలతో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు సాగిస్తున్నారా? ఈ పదిహేను నెలల కాలంలో మంథని నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారు? మల్హర్ మండలం కిషన్‌రావు పల్లె రోడ్డును పూర్తి చేయడానికి కేవలం రూ. 4 కోట్లు చెల్లించడానికి ఎందుకు మనసు రావడం లేదన్నారు. వీటన్నింటికి సమాధానం చెప్పడంతో పాటు మంథని ప్రజలతో పాటుగా ఆరు గ్యారంటీలు, 420 హామీలతో మేనిఫెస్టో రూపొందించి యావత్ తెలంగాణ ప్రజానీకాన్నిమోసం చేసిన మీరు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పుట్ట మధుకర్ ఆ బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు.