Pilot Rohith Reddy | హైదరాబాద్ : నా కొన ఊపిరి ఉన్నంత వరకు బీఆర్ఎస్లోనే ఉంటానని తాండూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ సైనికుడిగా పని చేయడమే నా లక్ష్యమని తేల్చిచెప్పారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న పుకార్లపై పైలట్ రోహిత్ రెడ్డి ప్రెస్ నోట్ విడుదల చేశారు.
సోషల్ మీడియాలో టీవీ చానెల్స్‌లో నాపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించేందుకు ఇలాంటి పుకార్లు లేపుతున్నారు. నేనే గువ్వల బాలరాజుని పంపినట్లు, మిగతా ఎమ్మెల్యేలను పంపిస్తాను అని కథనాలు రాస్తున్నారు. అవన్నీ తప్పుడు వార్తలు.. తీవ్రంగా ఖండిస్తున్నా. ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి. తాండూరు ప్రజలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు నాపై వస్తున్న పుకార్లను నమ్మొద్దు అని పైలట్ రోహిత్ రెడ్డి సూచించారు.
గతంలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు, ఎన్నో ఉన్నత పదవులు ఆశ చూపారు. తాండూరు, తెలంగాణ ప్రజల కోసం నేను పార్టీ మారలేదు. తెలంగాణ ను ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌ది. గతంలో బీజేపీ తరపున వచ్చిన వారిని బహిరంగంగా ప్రపంచానికి పట్టించాను. నా కొన ఊపిరి ఉన్నంతవరకు తాండూరు ప్రజా సేవే ముఖ్యం. తెలంగాణని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇతర పార్టీలకు తొత్తులుగా మారిన మీడియా ఛానెల్‌లు తప్పుడు కథనాలు ప్రసారాలు చేయవద్దు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరేవేర్చాలని కథనాలు ప్రసారాలు చేయండి. లోకల్ బాడీ ఎన్నికలకు సన్నాహక మీటింగ్‌లు నిర్వహిస్తున్నాం. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అని పైలట్ రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.