Peddi Sudarshan Reddy | హనుమకొండ : గోదావరి – బనకచర్ల లింకు ప్రాజెక్టు వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా ఎడారిగా మారనుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా జలాల గురించి తెలియని వాడు.. తెలంగాణ నీటి వనరులను ఎలా కాపాడుతాడు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. హనుమకొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి వెకిలి మాటలను ఖండిస్తున్నాం. చిన్న పగుళ్ల సాకు చూపి కాళేశ్వరం కూలిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే కాళేశ్వరాన్ని పండబెట్టి రైతుల పొలాలను ఎండగొట్టింది. నాట్లకు నాట్లకు మధ్య కేసీఆర్ రైతుబంధు ఇస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లకు ఓట్లకు మధ్య రైతుబంధు ఇస్తూ ఓట్ల రాజకీయం చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి వేసే డబ్బులు రైతు భరోసా కాదు ఎన్నికల భరోసా అని సుదర్శన్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రకారంగా ఇప్పటివరకు రైతులకు ప్రతి ఎకరాకు రూ. 25000 బకాయి పడ్డది. ఆ నగదు రైతుల ఖాతాలో వేస్తేనే కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నట్టు. రైతులు చైతన్యవంతులు, తెలివిగలవారు, కాంగ్రెస్ ఎన్నికలప్పుడే రైతుబంధు వేస్తుందని అర్థం చేసుకున్నారు. సీఎం రేవంత్‌కు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వనరులపై కనీసం అవగాహన లేదు అని పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీరందించే దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉందో కూడా రేవంత్ రెడ్డికి అవగాహన లేని వీరా తెలంగాణ హక్కులను కాపాడేది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలను ఎడారిగా మార్చే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా తాగు, సాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించుకున్న, అభివృద్ధి పరుచుకున్న పాకాల, ఘణపురం, లక్నవరం రిజర్వాయర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి తప్పు పడుతున్నాం. కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ప్రజల హక్కుగా రావలసిన నీటి వనరులను కాపాడే చిత్తశుద్ధి లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు అన్యాయం జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ స్థానిక మంత్రులు సీతక్క, సురేఖలు, ఎమ్మెల్యేలు, కనీసం నోరు మెదపడం లేదు అని సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు.
కుట్రపూరితంగా కాళేశ్వరంలో నీటిని నిల్వ చేయకపోవడం వల్ల ఎస్సార్ఎస్పీలోని డీబీఎం 38 కాల్వ పూర్తిగా ఎండిపోయి రైతుల పొలాలు ఎండిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మార్చినాటికే నీళ్ళు ఇవ్వలేమని చేతులెత్తేశారు. అదే కేసీఆర్ హయాంలో ఎర్రటి ఎండలు మే నెలలో సైతం నీటిని విడుదల చేసిన ఘనత దక్కుతుంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు తెలంగాణ ప్రజల అవసరాలు తెలియని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఎలా కాపాడుతాడు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు నీటి దోపిడీకి గోదావరి బనకచర్ల కడుతుంటే రేవంత్ రెడ్డి ఎలా అడ్డుకుంటాడు. రేవంత్ రెడ్డి వారి గురువు చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి గోదావరి, కృష్ణా జిల్లాలపై కనీస అవగాహన లేకుండా.. పరిపాలన సాగిస్తున్నందుకు తెలంగాణ ప్రజల హక్కులను కోల్పోయేలా చేస్తున్నందుకు వారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్లు ఉడతల సారంగపాణి, జోరిక రమేష్, నాయకులు తాళ్లపెళ్లి జనార్దన్ గౌడ్, నార్లగిరి రమేష్, పులి రజనీకాంత్, బండి రజనీ కుమార్, శోభన్ కుమార్, నయీముద్దీన్, సల్వాజి రవీందర్రావు, జానకి రాములు, అఫ్జల్, రామ్మూర్తి, (పెద్ది) మూటిక రాజు, రాజ్ కుమార్, శరత్ చంద్ర, వీరస్వామి, రాకేష్, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.