Padma Devender Reddy | మెదక్ : ఎమ్మెల్సీ కవిత విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసి కవిత తనకు తానే గొయ్యి తవ్వుకున్నారు అని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
గత రెండు, మూడు రోజులుగా కవిత మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కవిత తన తీరుతో పార్టీ కి ఎంతో నష్టం చేశారు. బీఆర్ఎస్కు సంపద లాంటి వ్యక్తి హరీష్ రావు.. ఆయనను బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణకు నష్టం కాదా..? అని ఆమె ప్రశ్నించారు.
కార్యకర్తగా, నేతగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉండి పనులు చేసిన వ్యక్తి హరీష్ రావు. నాడు హరీష్ రావు పనితీరును పొగిడిన వారే నేడు ఆరోపణలు చేస్తున్నారు. వారికి ఎలా మనసు ఒప్పుతుందో అర్ధం కావడం లేదు. ఈటెల రాజేందర్ పార్టీ నుండి వెళ్లిపోవడంలో హరీష్ రావు పాత్ర లేదు. కాళేశ్వరం ఎత్తిపోతల మీద శాసనసభలో హరీష్ రావు కాంగ్రెస్ డొల్లతనాన్ని ఎండగట్టారు. కవిత హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
పేగు బంధం కన్నా తనను నమ్ముకున్న కోట్లాది ప్రజలే, పార్టీ శ్రేణులు ముఖ్యమని కేసీఆర్ నిరూపించారు. పార్టీ తర్వాతే ఎవరైనా అని కేసీఆర్ సందేశం ఇచ్చారు. పార్టీ నుండి సస్పెండ్ అయినా కవిత మాటలు అర్థ రహితం.. తీవ్రంగా ఖండిస్తున్నాం. కవిత వ్యాఖ్యలను తన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇంకోసారి హరీష్ రావు గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కవిత పని చేస్తున్నారు. పార్టీ ఉంటె ఎంత పోతే ఎంత అని కవిత మాట్లాడొచ్చా..? కవితనే కేసీఆర్కు మచ్చ తెచ్చిందని ప్రజలు భావించారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గొప్పది అని పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు.