Padma Devender Reddy | మెదక్ : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. పీసీ ఘోష్ కమిటీ ట్రాష్ కమిటీ అని బీఆర్ఎస్ నేతలు చెప్పిన మాటే నిజమైందని, న్యాయస్థానంలో న్యాయం గెలిచిందని ఆమె అన్నారు.
మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఘోష్ కమిటీ రిపోర్టును న్యాయస్థానమే తప్పుపట్టిందని, దీని ఆధారంగా కేసీఆర్‌పైన, హరీశ్ రావుపైన ఎటువంటి చర్యలు తీసుకోరాదని, ఈ రిపోర్టు సరిగా లేదని న్యాయస్థానమే చెప్పిందన్నారు. భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, సీబీఐకి నివేదించినా, ఎవరికి ఇచ్చినా కూడా, తెలంగాణ ప్రజలకోసం కాళేశ్వరం ప్రాజెక్టును ఒక యజ్ఞంలాగా కట్టిన కేసీఆర్ విజయంతో ముందుకు వస్తారని, కాంగ్రెస్ కుట్రలను ఛేధిస్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌తో చేతులు కలిపి, బనకచర్లకు నీటిని తరలించేందుకు కాళేశ్వరం మీద కుట్ర చేసి, మేడిగడ్డను సాకుగా చూపెట్టి, తెలంగాణను ఎడారి చేయడానికి కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ ఉన్నాయని, వాటిని కేసీఆర్, హరీశ్ రావు ఘోష్ కమిటీ ముందు హాజరై చూపించి, తమ వాదనలు వినిపించారని గుర్తు చేశారు. ఘోష్ కమిటీ రిపోర్టు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ఉందే తప్ప, అందులో న్యాయం లేదని, ఇదే విషయాన్ని హైకోర్టు కూడా చెప్పిందని వివరించారు.కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, వాటిని ఛేధించుకుని నిప్పులాగా వారిద్దరూ నిలబడతారని, తెలంగాణ ప్రజల్ని కాపాడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలను, బహిరంగంగా లేఖ రూపంలో కేసీఆర్‌కు అందజేసిన ఎమ్మెల్సీ కవిత, అప్పటి నుంచి ఇప్పటి వరకూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారని, క్రమశిక్షణ తప్పారని అన్నారు. అందుకే కేసీఆర్ తన బిడ్డ అని కూడా చూడకుండా పార్టీ క్రమశిక్షణ తప్పిన ఆమెను సస్పెండ్ చేశారని, దీనిని అందరం స్వాగతిస్తున్నామని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని కేసీఆర్ సందేశాన్ని పంపించారని అన్నారు. 25 సంవత్సరాలుగా పార్టీని ఏర్పాటు చేసి, పోరాటం చేసి, గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంచి, పార్టీ శ్రేణులందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న కేసీఆర్ లక్ష్యాలను సాధించేందుకు అందరం అండగా నిలుస్తాం అని, పార్టీ పరంగా తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని స్పష్టం చేశారు.