Manchireddy Kishan Reddy | ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 18 : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ధ్యాస తప్పా.. ప్రజలను, నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకునే సోయిలేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి పదవి రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని గాలి మాటలు చెప్పటంకాదు.. దమ్ముంటే రాజీనామా చేయాలని మల్రెడ్డి రంగారెడ్డికి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు.
శుక్రవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడ సీకే కన్వెన్షన్హాల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల మహాసభకు సంబంధించి నిర్వహించిన నియోజకవర్గ సమన్వయకమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మంత్రి పదవి కోసం ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతూ ఏడాదిన్నర కాలంగా కాలం వెల్లదీస్తూ ప్రజా సమస్యలు గాలికొదిలేసిన మల్రెడ్డి రంగారెడ్డికి నియోజకవర్గం అబివృద్ధిపై సోయిలేదని విమర్శించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో చేపట్టిన అబివృద్ధి పనులు తప్పా.. కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో ఒక్కరూపాయి కూడా విడుదల చేసి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో భూమిపూజలు చేసి పనులు ప్రారంభించిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ దవాఖానా భవన నిర్మాణంతో పాటు కోట్లాది రూపాయలు వెచ్చించి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు సుందరీకరణ కోసం చేపట్టిన పనులు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. అలాగే, గత ప్రభుత్వ హాయాంలో పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న కూరగాయల మార్కెట్ మడిగెలు, మార్కెట్‌యార్డులోని మడిగెలు ప్రారంభించే ఓపిక కూడా ఈ ఎమ్మెల్యేకు లేదని తెలిపారు. తమకు మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేస్తానని గాలిమాటలు మాట్లాడే మల్రెడ్డి రంగారెడ్డి.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి కోరాలని సూచించారు.
ప్రభుత్వం నుంచి అభివృద్ధి కోసం ఒక్క రూపాయి తీసుకురాలేని మల్రెడ్డి రంగారెడ్డి లాంటి చేతకాని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవటం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజల దురదృష్టమని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల ముందు కోట్లాది రూపాయల ప్రొసిడింగ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అబివృద్ధిపనుల కోసం విడుదల చేస్తే అవి పూర్తిగా వెనక్కి మళ్లీపోయే విధంగా ఈ చేతకాని ఎమ్మెల్యే వల్లే జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఎప్పుడైనా ప్రజా సమస్యల పరిష్కారం ఈ ఏడాదిన్నర కాలంగా ప్రజల్లో తిరిగావా మల్రెడ్డి రంగారెడ్డి అని మంచిరెడ్డి ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధిని మరిచి ఢిల్లీ పెద్దల చుట్టూ, గాందీభవన్ చుట్టూ.. ముఖ్యమంత్రి వెనకాల తిరుగుతూ.. కాలం వెల్లదీస్తున్నాడు తప్పా.. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలనే కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
చేతకాని దద్దమ్మను గెలిపించుకున్న నియోజకవర్గ ప్రజలు దురదృష్టవంతులు : క్యామ మల్లేష్
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గత పదిహేను సంవత్సరాలుగా అబివృద్ధిలో ఉరకలు వేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్ తెలిపారు. ఎప్పుడైతే ఏడాదిన్నర కాలంగా ఈ ప్రాంతంలో ఓ చేతకాని దద్దమ్మ చేతిలోకి వెళ్లిందో అప్పటినుంచి ఉన్న అభివృద్ధితో పాటు ఈ ప్రాంతం పూర్తిగా శూన్యంగా మారిపోయిందని అన్నారు. ఈ ప్రాంత అబివృద్ధిని ఏమాత్రం పట్టించుకోని ఓ చేతకాని దద్దమ్మను గెలిపించిన ఇబ్రహీంపట్నం ప్రాంత వాసుల దురదృష్టం అని ఆయన అన్నారు. ఏడాదిన్నర కాలంగా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఏ ఒక్క అభివృద్ధికి కూడా రూపాయి కేటాయించకుండా.. తట్టెడు మట్టి పోయకుండా పనికిమాలిన మాటలు మాట్లాడుతూ.. చుట్టపుచూపుగా ఈ ప్రాంతంలో పర్యటించి వెళ్లడం సిగ్గుచేటని, దమ్ముంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం మల్రెడ్డి రంగారెడ్డి తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇబ్రహీంపట్నం నుంచి మరోసారి పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దండెం రాంరెడ్డి, జక్క రాంరెడ్డి, ఏర్పుల చంద్రయ్య, కృపేష్, బలరాం, ఆకుల యాదగిరి, బియ్యని జ్ఞానేశ్వర్, అల్వాల వెంకట్‌రెడ్డి, కొప్పు జంగయ్య, పాశం దామోదర్, కల్యాణ్‌నాయక్, బుగ్గ రాములు, రమేష్‌గౌడ్, కిషన్‌గౌడ్, రమేష్, రంగారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, యాదయ్య, వెంకట్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, భరత్‌కుమార్, భరత్‌రెడ్డి, జెర్కోని రాజు, జగదీష్, శివసాయితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.