Godavari | పెద్దపల్లి, మార్చి 15( నమస్తే తెలంగాణ): గోదావరి తల్లి గోసపై ఈనెల 17 నుంచి 23 వరకు 180 కిలో మీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ వెల్లడించారు. శనివారం పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో 17న ఉదయం గోదావరిఖని నుంచి ఎర్రవెల్లికి వెళ్లి కేసీఆర్ను కలిసి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎండిన గోదావరితో రైతన్నల కన్నీళ్లను, కష్టాలను చూసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరంతో కన్నీళ్లను తుడిచారన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్పై అక్కసుతో కాళేశ్వరం కూలిందని ఈ ప్రాంతాన్ని ఎండబెడుతున్నానన్నారు.
దేశంలోనే ఎక్కడా నిర్మించని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మహా నేత కేసీఆర్ అన్నారు. తెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు అని కాళేశ్వరం ద్వారా తెలంగాణలో సాగు పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంలో నీళ్ళను కిందకు వదిలిందని నిండు కుండలా ఉన్న గోదావరిని ఎండబెట్టి ప్రజలకు కష్టాలపాలు చేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారాలు చెప్పి, ఆ తప్పుడు ప్రచారాలను 100సార్లు పదే పదే చెప్పి వాటిని నిజం చేయడానికే కాళేశ్వరం నీళ్ళు కిందకు వదిలారన్నారు. నీళ్ళు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు అరిగోస పడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు పాదయాత్ర చేపడుతున్నామని వివరించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమానికి గోదావరిఖనికి చెందిన ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు బొడ్డుపల్లి రవీందర్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రఘువీర్ సింగ్, మూల విజయ రెడ్డి, గోపు అయిలయ్య యాదవ్, పెంట రాజేష్, బొడ్డుపల్లి రవీందర్, ఉప్పు రాజ్ కుమార్, నారాయణదాసు మారుతి, కౌటం బాబు, రామరాజు, కిరణ్ జీతో పాటు పలువురు పాల్గొన్నారు.