Jeevan Reddy | ఖలీల్‌వాడి : తెలంగాణలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కండకావరమే కనిపిస్తున్నది.. అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలు, నిర్బంధాలు, కూల్చివేతలు, పేల్చివేతలు.. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? అని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇది ప్రజా పాలన కాదు, రాక్షస పాలన అని మండిపడ్డారు.
నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ భూములు పాడిపంటలతో విలసిల్లితే, రేవంత్‌రెడ్డి వచ్చాక అగ్నిమంటలతో కాలిపోతూ కనిపిస్తున్నాయన్నారు. సీఎం సోదరులది అంతులేని అవినీతి, చిట్టినాయుడు దుర్నీతికి తెలంగాణ ఆహుతి అవుతుందని తెలిపారు. రేవంత్ సోదరుల భూకబ్జాలకు అధికారులు వంత పడుతున్నారని, పల్లెల్లో అధికారుల దురహంకారం పెరుగుతుండంతో రైతులు, ప్రజలు తిరగబడుతున్నారన్నారు. మొన్న లగచర్ల, నిన్న దిలావర్పూర్.. ఏ గ్రామంలో అయినా కాంగ్రెస్ సర్కారుపై ప్రజల సంగ్రమమే కనిపిస్తున్నదన్నారు. రైతులతో పెట్టుకున్న వాళ్లెవరు బాగు పడలేదని, బషీర్‌బాగ్‌లో రైతులను చంపించిన చంద్రబాబు తట్టాబుట్టా సదురుకుని పోయిండని జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబుకు పట్టిన గతే చిట్టినాయుడికి పడుతుందన్నారు. గురుకులాల్లో మరణ మృందగం మోగుతున్నదని, 11 నెలల్లో 48 మంది విద్యార్థులు మృత్యువాత పడితే పట్టించుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.
ఆటో డ్రైవర్ నుంచి అంగన్వాడీల వరకూ, ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల వరకూ ఎవరూ సంతోషంగా లేరని తెలిపారు. పోలీసులు, లాయర్లు సైతం రోడ్లపైకి వస్తున్నారన్నారు. బాసర నుంచి మొదలు కీసర దాకా అందరు దేవుళ్లకు శఠగోపం పెట్టిన ఘనుడు రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో రూ.లక్షన్నర కోట్ల అవినీతికి సిద్ధపడుతున్నాడని ఆరోపించారు. ఇదేమని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని తెలిపారు. అధికారులు అతి చేస్తున్నారని, వారి పేర్లు పింక్ బుక్‌లో ఎక్కిస్తున్నామని చెప్పారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, తప్పు చేసిన వారు ఎక్కడున్నా పట్టుకుని వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. దీక్షా దివస్ స్ఫూర్తితో రేవంత్ సర్కారుపై సమరభేరి మోగిస్తామని చెప్పారు.
జడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, బీఆర్ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి ఆయేషా ఫాతిమా, నేతలు రాంకిషన్‌రావు, సుజీత్‌సింగ్ ఠాకూర్, ప్రభాకర్, సత్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.