Jeevan Reddy | నిజామాబాద్ : ఆర్మూర్‌లో నా ఇంటి చుట్టూ, నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ ఆఫీస్ చుట్టూ పోలీసులను మోహరించడం దారుణమని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వందలాది మంది బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ఆర్మూర్ అంటేనే రైతులు, రైతులంటేనే ఆర్మూర్. అలాంటి ఆర్మూర్‌లో పాదయాత్ర పెట్టుకొని రైతులను అక్రమంగా అరెస్టు చేయడమేంటి? అసలు ఇదేం పాలన? ఇవేం నిర్బంధాలు? ఇది ప్రజాపాలన కాదు, పోలీసు పాలన. ఇందిరమ్మ పేరుతో హింసాత్మక రాజ్యం నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. అడుగు తీసి అడుగేస్తే కేసు! నోరు తెరిస్తే కేసు.. నిరసన తెలిపితే కేసు! ప్రజల తరఫున నిలబడితే కేసు! పాలనావైఫల్యాలు ఎండగడితే కేసు! పరామర్శకు పోయినా కేసు! ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే కేసు! సీఎంను విమర్శిస్తే కేసు! సీఎం పేరు మరిచిపోయినా కేసు! ఒక్కో రంగాన్ని టార్గెట్ చేసి, కక్షగట్టి అందులోని ప్రముఖుల మీదా కేసులు! అక్రమ కేసులపై ఆందోళన చేస్తే దానిపైనా మరో అక్రమ కేసు నమోదు చేస్తున్నారని జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అసలు తెలంగాణ లో ఏం జరుగుతోంది? దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే.. రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యాంగం అమలవుతున్నది. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ..? ఎవడేలుతున్నడురో తెలంగాణ. నేడు కాంగ్రెస్ పొట్టేళ్ల దాష్టీకాలు నాటి బ్రిటిష్ పాలకుల అకృత్యాలను మర్పిస్తున్నాయి. కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణ నేడు ఈనగాచి నక్కల పాలు చేసినట్లయింది. కేసీఆర్ పదేళ్ల స్వర్ణ యుగం పోయి కాంగ్రెస్ మార్క్ ఖాకీ పాలనొచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటేనే బాసిజం, ఫాసిజం అన్నట్టుగా ఉంది. ఇందిరమ్మ రాజ్యమంటేనే అణచివేత, అవినీతి మేత, అబద్దాల రోత అని జీవన్ రెడ్డి విమర్శించారు.
డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి పదవి కాపాడుకునేందుకు జూబ్లీహిల్స్ ప్యాలెస్ టూ ఢిల్లీకి చక్కర్లు కొడుతోండు. షాడో సీఎం మీనాక్షి నటరాజన్ ఆలూరు టూ ఆర్మూర్ పాదయాత్ర పేరుతో అన్నదాతలపై దండయాత్ర చేస్తోంది. గాంధేయవాదినని చెప్పుకొనే మీనాక్షి నటరాజన్ గాడ్సే సిద్ధాంతాలను అమలు చేస్తోంది. ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి గులాబీ శ్రేణులను ముందస్తుగా అరెస్టు చేసి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాల రాస్తోంది. తెలంగాణ రాష్ట్రం లో లా-లెస్ పాలన నడుస్తోంది. నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇప్పుడు నేను పిలుపునిస్తున్నా. పాదయాత్ర చేస్తున్న మీనాక్షి నటరాజన్‌ను ప్రజలు ఆరు గ్యారెంటీలు, 420 హామీలనపై నిలదీయాలి. మోసపూరిత కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడాలి. సిద్ధులగుట్ట శివయ్య సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్న ఒట్లు ఏమయ్యాయని ప్రశ్నించాలి. రుణ మాఫీ కాని, రైతు భరోసా రాని, రైతు బీమా అందని రైతులు కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీయాలి. తులం బంగారం రాని వారంతా రోడ్లపైకొచ్చి మీనాక్షిని ప్రశ్నించాలి. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రాని యువకులు, స్కూటీలు రాని విద్యార్థినులు కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీయాలి. అసలు మీ పాదయాత్ర దేనికని మీనాక్షిని అడగాలి. పోలీసులు అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.