Jeevan Reddy | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి గురివింద గింజ లాంటోడు అని విమర్శించారు. తెలంగాణ భవన్లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
దొంగే దొంగ అని అరిచినట్టుంది రేవంత్ తీరు. హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి రే వోంట్ (Re won’t Reddy)రెడ్డి గా మారారు. కేసీఆర్ అంటే ట్రిపుల్ ఆర్ స్కీమ్స్.. రేవంత్ అంటే ట్రిపుల్ ఆర్ స్కామ్స్ అని విమర్శించారు. ట్రిపుల్ ఆర్ అంటే రేవంత్ రెడ్డి ,రాహుల్ గాంధీ, రంజిత్ రెడ్డి స్కామ్స్. కేసీఆర్‌వి ట్రిపుల్ ఆర్ స్కీమ్స్ అంటే రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా అని తెలిపారు. కుంభకోణాల ద్వారా వసూలు చేసిన డబ్బు రాహుల్ గాంధీకి వెళ్తోంది. కేటీఆర్ మీద కేసు సిగ్గు చేటు అని మండిపడ్డారు. అసలు ఏఐసీసీ అంటేనే ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఇంగ్లీష్ అక్షరమాలలోని ఏ నుంచి జడ్ వరకు కుంభ కోణాలు చేశారు. పీసీసీ అంటే ప్రదేశ్ కరప్షన్ సెంటర్. మూడు రంగాల జెండాను పెట్టుకుని అవినీతి దందాలు చేస్తున్నారు. జాతీయ పతాకాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నా కాంగ్రెస్ తన జెండాను మార్చుకోవాలి అని జీవన్ రెడ్డి సూచించారు.
రేవంత్ ముఖ్య సలహాదారులు ఐదు వేల కోట్ల రూపాయలకు తక్కువ కమిషన్ తీసుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఓ బిల్డర్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకు కోర్టులో పిల్ వేశారు. రేవంత్ అనుచరుడు ఫహీం ఖురేషి మరో నయీమ్‌గా మారారు. లియోనియా రిసార్ట్‌లో ఫహీమ్ ఖురేషి పది వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్ 180 ఎకరాల్లో ఉంది. ఈ రిసార్ట్ బ్యాంకులకు రూ. 2200 కోట్ల బకాయిలు పడ్డది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నాడు ఈ లియోనియాను మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి రూ. 330 కోట్లకు కొట్టేశాడు. టెండర్లలో ఎవ్వరూ పాల్గొనకుండా ఫహీమ్ ఖురేషి ఒత్తిడి తెచ్చి రంజిత్ రెడ్డికి లియోనియా దక్కేలా చేశారు. ఇందులో బీజేపీ ఎంపీలకు కూడా వాటా ఉంది. అందుకే దీనిపై వారు మాట్లాడటం లేదు. లియోనియాకు డబ్బు బదిలీలో మనీ లాండరింగ్ కూడా ఉంది. ఈ వ్యవహారంపై విచారణ జరగాలి. విచారణ జరిపించకపోతే తప్పు జరిగినట్టే భావించాల్సి ఉంటుంది. బ్యాంకులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టారు. కేంద్ర నిఘా సంస్థలు ఈ వ్యవహారంలో వెంటనే రంగంలోకి దిగాలి. ఈ కుంభకోణం ట్రైలర్ మాత్రమే. మరిన్ని కుంభకోణాలు త్వరలోనే బయటపెడుతామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.