Gadari Kishore | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొనగాడు అయితే మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్టులు చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్య గౌడ్, కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ నేతలు కృష్ణారెడ్డి, ధర్మేందర్ రెడ్డి, కృష్ణతో కలిసి గాదరి కిశోర్ మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి పాడిందే పాట.. అన్నట్లు నిన్న మాట్లాడారు. నల్గొండ జిల్లాకు సీఎం వచ్చారు.. కాబట్టి జగదీష్ రెడ్డిని తిట్టారు. నిన్న సీఎం పర్యటనను అడ్డుకుంటామని మేము ఎక్కడా చెప్పలేదు. తుంగతుర్తి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వంత ఊర్లో రైతు రుణమాఫీ అయిందో లేదో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి ఏమైనా ఆరు ఫీట్లు ఉన్నాడని మూడు ఫీట్లు గురించి మాట్లాడుతున్నాడా..? జగదీష్ రెడ్డి 30 ఫీట్లు దించుతున్నాడని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఉరి తీయాల్సింది రేవంత్ రెడ్డిని. సోడా కలిపినంత ఈజీ కాదు గోదావరి నీళ్లు ఇచ్చుడు అని సీఎం అంటున్నారు. కానీ బిఆర్ఎస్ హయాంలో మేము తుంగతుర్తికి గోదావరి నీళ్లు ఇచ్చాము. తుంగతుర్తి నియోజకవర్గంలో మూడు కొత్త మండలాలు అయితే రెండు మండలాలకు బిల్డింగులు ఎట్లా మంజూరు చేశావు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గోడల మీద రాతలు రాసి గోడలు దూకి రాలేదా…? అని నిలదీశారు.
జగదీశ్ రెడ్డికి గంజి ఉందో బెంజ్ ఉందో నాగారం వచ్చి చూడు రేవంత్ రెడ్డి. నిన్న తుంగతుర్తిలో వైన్స్ షాప్ దొంగను పక్కన కూర్చోబెట్టి ఓటుకు నోటు దొంగ మాట్లాడారు. రేవంత్ రెడ్డి జీవితం క్లబ్బులతో, పబ్బులతో స్టార్ట్ అయింది. జూబ్లీహిల్స్ క్లబ్లో మెంబర్గా జాయిన్ అయ్యి రేవంత్ రెడ్డి అందరిని బ్లాక్ మెయిల్ చేశారు. సాగర్ నీళ్లు మాకు రాకుండా ఖమ్మం తీసుకువెళ్తుంటే నీళ్ల మంత్రి ఉత్తమ్ మాట్లాడటం లేదు. దేవాదుల ఎక్కడ ఉందో తెలియనివాడు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తెస్తానని అంటున్నారని మాజీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.
పింఛన్లు కట్ చేస్తాము, ఇందిరమ్మ ఇళ్ళు, డ్వాక్రా రుణాలు ఇవ్వమని భయపెట్టి తుంగతుర్తి మీటింగ్కు ప్రజలను తీసుకువచ్చారు. ప్రభుత్వం మీటింగ్లో జై కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి అనలేదు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మల్లిఖార్జున ఖర్గే జై తెలంగాణ అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి. కేసీఆర్ తిట్టకపోతే ప్రజలు నన్ను మర్చిపోతారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి దేవుడు మంచిబుద్ది ప్రసాదించాలి అని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ పేర్కొన్నారు.