Hanmakonda | హనుమకొండ చౌరస్తా, మే 30: కాంగ్రెస్ పార్టీకి పెద్దలపై ప్రేమ కురిపిస్తూ, పేదలపై ప్రతాపం చూపుతోందని, కూరగాయలు అమ్మేవారి జీవితాలను కూల్చుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ మండిపడ్డారు. హనుమకొండ రస్తా వద్ద ఉన్న చిరువ్యాపారుల సముదాయాలను మున్సిపల్, పోలీస్ అధికారులు తొలగించిన నేపథ్యంలో వారిని ఆయన శుక్రవారం కలిశారు.
ఈ సందర్భంగా బాధితులు 15 ఏండ్లుగా రస్తాలో చిన్నచిన్న వ్యాపారాలు, కూరగాయలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నామని, ఇటీవల పోలీస్, మున్సిపల్ అధికారులు తమ పొట్ట కొట్టారని, వ్యాపార సముదాయాలను కూల్చారని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని గోడు వెళ్లబోసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలపై ప్రేమ లేదని, తమ జీవితాలను ఆగం చేసిందని వాపోయారు. పిండి రమేష్ అనే చిరువ్యాపారి జీవితం ఆగమైందని, జీవనోపాధి కోల్పోయామని ఆత్మహత్య చేసుకుని ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్నారని బాధిత కుటుంబం వినయ్‌భాస్కర్‌కి తెలిపారు. మరో మహిళ తన కూతురుతో సహ ఇక్కడ ఏండ్లుగా కూరగాయలు అమ్ముతూ జీవితాన్ని వెళ్లదీస్తున్నామని, నేడు రోజు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. మరో మహిళ అప్పులు తెచ్చి చిన్న వ్యాపారం చేస్తుంటే కూల్చివేతల కారణంగా అప్పుల పాలమయ్యామని ఆవేదన చెందారు.
అనంతరం దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను కాల రాస్తే ఊరుకోమని, కార్మికులకు అండగా ఉద్యమిస్తామన్నారు. చిరువ్యాపారుల జీవితాలతో చెలగాటాలొద్దన్నారు. రస్తా చిరు వ్యాపారులకు ప్రభుత్వం న్యాయం చేయాలని, వారికి నష్టపరిహారం అందించాలని, రస్తాలోని వారి అడ్డాను పునరుద్ధరించాలని వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక శాసన సభ్యులు, మున్సిపల్ మేయర్ కాజీపేట నుంచి వరంగల్ రైల్వేస్టేషన్ వరకు ప్రధాన రహదారి వెంట ఉన్న చిరువ్యాపారుల సముదాయాలను ధ్వంసం చేస్తున్నారని, వారి జీవితాల ను చిధ్రం చేస్తున్నారని మండిపడ్డారు.
2014 చిరువ్యాపారుల చట్టం ఉన్నా చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారని, చట్టాలపై అవగాహనలేని ప్రభుత్వం పేదల బతుకులను ప్రశ్నార్థకం చేస్తున్నాయన్నారు. 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని, చిరు వ్యాపారులకు న్యాయం జరిగే వరకు గులాబీజెండా వారికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం భార త రాష్ర్ట స మితి పార్టీ గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్ల బృందం బాధితులతో కలిసి మున్సిపల్ అధికారులకు సమస్యను పరిష్కరించి చిరువ్యాపారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి పులి రజినీకాంత్, 4వ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్‌కుమార్, 5వ డివిజన్ అధ్యక్షుడు బొల్లపెల్లి చందర్, చింతాకుల ప్రభాకర్, పేర్ల మనోహర్‌రావు, ఖలీల్ ఉన్నారు.