Chirumarthi Lingaiah | నల్లగొండ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిప్పులు చెరిగారు. ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకే యాసంగిలో రూ. 800 కోట్లు బాకీ పడ్డారని కాంగ్రెస్ ప్రభుత్వంపై లింగయ్య ధ్వజమెత్తారు. నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలతో పాలన సాగిస్తుంది. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ వస్తుంది. ఎన్నికల్లో రైతు భరోసా రూ. 15 వేలు ఇస్తా అని చెప్పి మోసం చేశారు. కానీ కేసీఆర్ ఏ హామీ లేకుండానే ఎకరానికి రూ. 12 వేల రైతుబందు ఇచ్చారు.
కానీ రేవంత్ సర్కార్ రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుంది. రైతుబంధు కోసం కేసీఆర్ జమ చేసిన డబ్బులను అధికారంలోకి రాగానే రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకుని బిల్లులు ఇచ్చారు అని చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.
ఇపుడు ఎన్నికలు వస్తున్నాయని రైతు భరోసా ఇస్తుండు అట. కుప్పలు కుప్పలుగా అప్పులు తెస్తూ కమిషన్ల కోసం బిల్లులు చెల్లిస్తున్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు చేతగాని మంత్రులుగా మిగిలిపోయారు. జిల్లాకు ఏమి చేయలేకపోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో చేస్తున్న విచారణ అంతా బుటకం. దీనిపైన ఘోష్ కమిషన్ అడిగిన క్యాబినెట్ మినిట్స్‌ను కూడా సర్కార్ ఇవ్వలేక పోయింది. అంటే ఇందులో ఏమి లేదని స్పష్టం అవుతుంది. ఈ ఫార్ములా కేసులోనూ జరిగిన తప్పేమి లేదు. కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కేటీఆర్‌కు పదే పదే విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాను. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసులు, నోటీసులు. కేటీఆర్ మీదనే 14 అక్రమ కేసులు పెట్టారని చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు.
ఎన్ని కేసులు పెట్టినా.. బీఆర్ఎస్ భయపడబోదు. ప్రజల్లో ఉండి ప్రభుత్వంపై పోరాట చేస్తాం. స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసా. ఇన్నాళ్లు ఎన్నికలు పెట్టకుండా స్థానిక సంస్థలనూ నిర్వీర్యం చేశారు. బీసీ రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలకు ఎలా వెళ్తారు. 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలి. గత సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, స్థానిక కాంట్రాక్టర్లకు తక్షణమే బిల్లులు చెల్లించాలి. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న యాసంగి రైతు భరోసా ఇప్పించే బాధ్యత జిల్లా మంత్రులు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లాలోని ఎమ్మెల్యేలకు దొరికింది దోచుకోవడమే సరిపోతుంది.కబ్జాలు, ఆక్రమణలకే వీరు పెద్ద పీట వేస్తున్నారు. కమిషన్లు వచ్చే పనులనూ పట్టుకుని సీఎం చుట్టూ తిరిగేందుకు ఎమ్మెల్యేలకు సమయం సరిపోతలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ ఢంకా మోగించనుందని చిరుమర్తి లింగయ్య తెలిపారు.