Balka Suman | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర విమర్శలు చేశారు. రామ్కో సిమెంట్ కంటే దృఢమైన బంధం కిషన్ రెడ్డిది, రేవంత్ రెడ్డిది అని సుమన్ అన్నారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పెద్దమ్మ, చిన్నమ్మల కొడుకుల్లా వుంటారు. బీజేపీ సీఎంకు దొరకని అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డికి దొరుకుతుంది. బీజేపీ ఎంపీలతో రేవంత్ రెడ్డి దగ్గరగా వుంటారు. బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి కాంట్రాక్టు ఇచ్చారు. టీడీపీలో ఉన్నప్పుడు బీజేపీ ఎంపీతో రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డి కోసం పని చేస్తున్నారు. బండి సంజయ్ తెలంగాణలో రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీలు కాపాడుతున్నారు. బీజేపీ ఎంపీలు మెంబర్ ఆఫ్ రేవంత్ రెడ్డిగా మారారు. బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డిపై ఈగ వాలనివ్వరు అని బాల్క సుమన్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటమిని ఒప్పుకున్నారు. సీఎం గల్లీ గల్లీ తిరుగుతున్నారు అంటేనే.. ఓటర్లను, బిఆర్ఎస్ వాళ్ళను భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు అంటేనే ఓటమి భయం కనపడుతుంది. ఎన్నడూ లేని విధంగా సీఎం తొమ్మిది రోజులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి భాష చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. నిన్న బరితెగించి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోకి వారి ఇళ్ళు రాకపోయినా రైడ్స్ చేశారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు నివాసంలో సోదాలు చేసి ఏమీ దొరకలేదని పోలీసులు చెప్పారు. సమాచారంతోనే సోదాలు చేశామని పోలీసులు అంటున్నారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళను పోలీసులు విచారణ చేశారా…? నిన్న ఎర్రగడ్డలో కాంగ్రెస్ నేత ఇంట్లో సోదాలు చేసినట్లు డ్రామా చేశారు అని బాల్క సుమన్ మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి అయ్యాయి. బండి సంజయ్ వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి సహకారం అందిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కుక్కర్లు పంచుతూ, గూగుల్ పే, ఫోన్ పే చేస్తామని ఓటర్లకు చెప్తున్నారు. ఎన్నికల కమీషన్, అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. బైండోవర్ చేసిన 140 మందిని ఎన్నికల రోజు బయటకు రానివ్వవద్దని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నా. పోలీసుల దౌర్జన్యం, అరాచకాలు ఎక్కువ అయ్యాయి. ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నేతలు,కార్యకర్తలను బెదిరిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలీసులు రేవంత్ రెడ్డి ప్రయివేటు సైన్యంలా పనిచేస్తున్నారు. ఏపీలో ఏం జరుగుతుందో పోలీసులు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లలా
పోలీసులు పని చేయవద్దు అని బాల్క సుమన్ సూచించారు.