Balka Suman | హైదరాబాద్ : గోదావరి నదీ జలాల విషయంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను తిప్పికొడుతామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో ప్రగతి కుంటుపడింది. ఇందిరమ్మ రాజ్యం పేరిట ఎమర్జెన్సీ మళ్ళీ వచ్చింది. రేవంత్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ అనలేదు. డిల్లీకి ఊడిగం చేస్తూ చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడు. రోజుకో డైవర్షన్ స్కీమ్ తో తన పబ్బం గడుపుకుంటున్నాడు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుట్ర చేసి బనక చర్ల ప్రాజెక్ట్ కు గోదావరి నదీ జలాలను తరలిస్తున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు మా విద్యార్థి విభాగం నేతలను సన్నద్ధం చేసేందుకు సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అని బాల్క సుమన్ స్పష్టం చేశారు.
కెసిఆర్ పదేళ్ల పాలనలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నేతలు కుక్కిన పేనులా ఉన్నారు. కేసులు పెట్టి వేధించటం ఇందిరమ్మ పాలనా..? కేటీఆర్ బర్త్ డే ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ వాళ్ళు చింపి వేయటం అరాచకం. కృష్ణా గోదావరి జలాల్లో నీటి వాటా వచ్చే వరకు పోరాటం చేస్తాం. తెలంగాణకు కాంగ్రెస్ ఎలా అన్యాయం చేస్తుందో తెలియజేయడానికి బీఆర్ఎస్వీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలని పని చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీన ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ లో విఎన్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్వీ సదస్సులు నిర్వహిస్తున్నాం అని బాల్క సుమన్ తెలిపారు.