సిద్దిపేట : ‘ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ముందుకు వస్తున్న బీఆర్ఎస్, కేసీఆర్ వైపు దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ వేసే ప్రతి అడుగు రైతుల కోసమే నని ఆయన స్పష్టం చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్, పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని అన్నారు.‘ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ధాన్యం కొనుగోలుకు కాంటాలు వచ్చాయి. భూమికి బరువయ్యేంత పంట పండింద’ ని వివరించారు . దేశ వ్యవసాయ వృద్ధిరేటు 4 శాతం ఉంటే, తెలంగాణ వ్యవసాయ వృద్ధిరేటు 8 శాతం ఉన్నదని పేర్కొన్నారు.గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు సాయం చేస్తూనే వచ్చే 45 రోజులలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టులో 10 కిలోమీటర్ల పనిలో 9.70 కిలోమీటర్ల పని పూర్తయ్యిందని, కేవలం 300 మీటర్ల పని పెండింగులో ఉన్నదని వివరించారు. ఇప్పటికే గౌరవెల్లి ప్రాజెక్టుకు రూ.86.97 కోట్లు అదనంగా నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. సమైక్య పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని వివరించారు.
రైతుబంధు కింద..
2019లో 2 లక్షల 35 వేల 534 మంది రైతులకు రైతు బంధు ఇవ్వగా, 2022లో 3 లక్షల 3 వేల 333 మంది రైతులకు అందించినట్లు వెల్లడించారు. , కేంద్ర బీజేపీ పీఏం కిసాన్ యోజన కింద రైతులకు 2019లో 1.74 లక్షల మంది రైతులకు ఇవ్వగా, 2022లో 1.39 లక్షల మంది రైతులకు తగ్గించిందని విమర్శించారు.
త్వరలోనే ఉగాది పండుగ తర్వాత 250 కోట్లతో గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేస్తామన్నారు. ఇంటి జాగలో ఇల్లు కట్టుకునేందుకు ఉగాది పండుగ తర్వాత నిధులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.