ఎదులాపురం, నవంబర్ 14: తెలంగాణలో మరోసారి ఎగిరేది గులాబీ జెండానేనని నాందేడ్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి శంకరన్న దొండ్గే స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన, జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మరాఠ్వాడ్ కోఆర్డినేటర్ దత్త పవార్‌తో కలిసి మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో మహారాష్ట్రకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. గత పదేండ్లలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా సీఎం కేసీఆర్ నిలిపారని కొనియాడారు. తెలంగాణ, మహారాష్ట్రతో పాటు దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు చాలా అవసరమని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రైతుల సంక్షేమ కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ఏకైక లీడర్ కేసీఆర్ అని ప్రశంసించారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో మహారాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీతోపాటు ప్రాంతీయ పార్టీల పాలన చూశానని, కానీ తెలంగాణలో అందుతున్న ప్రజారంజక పాలన ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీ, శివసేన పాలనతో ప్రజలు విసుగు చెందినట్టు చెప్పారు. కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని తమ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో మహారాష్ట్ర సరిహద్దుల్లో కొన్ని చోట్ల సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమావ్యక్తం చేశారు.