నెల్లికుదురు, ఆగస్టు 20: రైతుకు యూరియా బస్తాలు ఇవ్వలేని కాంగ్రెస్‌కు పాలించే అర్హత లేదని, తక్షణమే దిగిపోవాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల పరిధిలోని రైతులు యూరియా కోసం మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి నెల్లికుదురు సొసైటీ ఎదుట క్యూలో చెప్పులు పెట్టి పడిగాపులుకాశారు. మహిళా రైతులు బాక్స్‌లు తెచ్చుకుని వర్షంలో తడుచుకుంటూ నిలబడ్డారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత నెల్లికుదురు సొసైటీ ఎదుట తొర్రూరు-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై 1000 మందికి పైగా రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.
దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయు. రైతులను రోడ్డెక్కించిన సీఎం రేవంత్ దిగిపోవాల్సిందేనని రైతులు పెద్ద ఎత్తున నినిదించారు. మండల ప్రత్యేకాధికారి, మండల వ్యవసాయ అధికారి, తహసీల్దార్, ఎస్సై చిర్ర రమేశ్‌బాబు వచ్చి కవిత, రైతులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళా రైతులు సైతం యూరియా బస్తా కోసం అర్ధరాత్రి 12 గంటల నుంచి వర్షంలో వేచి చూడాల్సిన దుస్థితి నెలకుందని ఆవేదన వ్యక్తంచేశారు. గత బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో ఏనాడూ రైతన్న రోడ్డెక్కలేదని గుర్తుచేశారు. రైతుల ఉసురుతీసుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.