సిద్దిపేట కమాన్, ఏప్రిల్ 13 : కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని తుగ్లక్, రాక్షస పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. తమ సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు ఆరు రోజులుగా సిద్దిపేట పట్టణంలోని విద్యుత్తు డీఈ కార్యాలయం వద్ద వద్ద సమ్మె చేపడుతున్నారు. సోమవారం హరీశ్‌రావు ఆర్టీజన్లను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ డిమాండ్లు నెరవేర్చాలని రాష్ట్రంలో 27వేల మంది ఆర్టిజన్లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. వారి డిమాండ్లను నెరవేర్చకపోతే ఆర్టిజన్ల పక్షాన బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 26 వేల మందిని ఆర్టిజన్లుగా గుర్తించి మంచి వేతనం అందించినట్టు చెప్పారు. సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తే వారి వద్దకు వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చాయ్ తాగినంత సేపట్లో మీ సమస్యను పరిషరిస్తా’మని చెప్పాడని, రెండున్నరేండ్లలో ఎన్ని చాయ్‌లు తాగినా సమస్యను ఎందుకు పరిషరించలేదని ఎద్దేవా చేశారు. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులతో పాటు ఉపాధి హామీ ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా వరర్లను కూడా రేవంత్‌రెడ్డి మోసం చేశారని అన్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 13: ఆర్టిజన్ల సమ్మె ఉధృతంగా కొనసాగుతున్నది. సోమవారం నాటికి ఆరో రోజుకుచేరుకున్నది. భద్రాద్రి జిల్లా పాల్వంచలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. మహబూబాబాద్‌లో ఆర్టిజన్ల దీక్షకు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు సంఘీభావం ప్రకటించారు. నర్సంపేటలోని ఆర్టిజన్ల సమ్మె శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సందర్శించారు.