హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. అడ్డగోలు ఆంక్షలతో రుణమాఫీ కాక అయోమయంలో ఉన్న రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు కార్యాచరణ ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. రూ.2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయ్యిందని ముఖ్యమంత్రి చెప్తుంటే, ఇంకా రుణమాఫీ పూర్తికాలేదని, కార్యక్రమం కొనసాగుతుందని మంత్రులు చెప్తున్న వైనాన్ని ఆయన ఎండగట్టారు. ఎవరికి తోచిన రీతిలో వారు మాట్లాడుతూ రైతులను ఆయోమయానికి, ఆవేదనకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీని అందరికీ వర్తింపజేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ స్పష్టంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారని, ఆ తర్వాత రూ.31 వేల కోట్లకే మంత్రివర్గ సమావేశం అనుమతిచ్చిందని చెప్పారని తెలిపారు. బడ్జెట్లో మాత్రం రూ.26 వేల కోట్లకు ఆమోదం తెలిపి రైతులను మోసం చేశారని విమర్శించారు. బడ్జెట్లో కేటాయించిన రూ. 26 వేల కోట్లలో నుంచి కేవలం రూ.18 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం రైతులను నిలువునా ముంచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదని క్షేత్రస్థాయి నుంచి తమకు సమాచారం ఉన్నదని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి కారణంగా లక్షలాది మంది రైతులు రోజూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ అయ్యే వరకు బీఆర్ఎస్ వారికి అండగా ఉండి పోరాడుతుందని కేటీఆర్ తెలిపారు.