మర్రిగూడ, జనవరి 22: యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే యాప్ తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు గురువారం రైతులతో కలిసి నల్లగొండ జిల్లా మర్రిగూడలో మెరుపు ధర్నాకు దిగారు. గంటపాటు వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడు తూ.. చదువురాని రైతులు స్మార్ట్ ఫోన్లో యూరియాను ఎలా బుక్ చేసుకుంటారని ప్రశ్నించారు.
మొన్నటివరకు స్లాట్ బుకింగ్‌తో ఇబ్బందులుపడ్డ పత్తి రైతులు చివరకు పంటను దళారులకే విక్రయించినట్టు గుర్తుచేశారు. యాప్‌లో యూరియా కనిపించినా షాపుల్లో దొరకడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్‌తో ఆధార్‌కార్డు పంపితే యూరియా ఇంటికి వచ్చేదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే యాప్ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.