హైదరాబాద్: రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ (BRS) పోరు బాటపట్టింది. రేవంత్ సర్కార్ మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టింది. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు కదంతొక్కారు. అన్ని మండల కేంద్రాల్లో రైతుల కలిసి పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ.. నిరసన కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు.