హైదరాబాద్, మే 16 (నమస్తేతెలంగాణ): బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఒకవైపు నిందితులతో అలయ్.. బలయ్ తీసుకుంటూ మరోవైపు బాలి క కుటుంబానికి న్యాయం చేస్తానని నమ్మబలుకుతున్నారని మండిపడ్డారు. నిందితుడిని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాల్సిన ఆయన.. అప్పగించాలని నిందితుడి తండ్రిని బతిమాలిన తీరు సీఎం నిస్సహాయతకు అద్దంపట్టిందని విమర్శించారు. ‘మైనర్ హక్కులను కాపాడుతూ హైకోర్టు తీసుకున్న చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. నిందితుడు బలమైన వ్యక్తి అయినప్పటికీ, ఆయన కుటుంబం వెనుక అపరిమితమైన అధికారులన్నప్పటికీ చట్టం ముందు అందరూ సమానులే అని నిరూపించిన న్యాయస్థానానికి ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానించారు. అనారోగ్యం బారినపడ్డ బండి సంజయ్ మాతృమూర్తి కోలుకోవాలని ప్రార్థించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్‌గౌడ్, ఉపేంద్ర, సైదులు, నిర్మల, దాసరి ఉష, ముసా రాజేశ్వరి, పుష్పలతతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నా గురించి.. నా పిల్లల గురించి ఏబీవీపీ, బీజేపీ నేతలు సమాచారం సేకరిస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది.. నా జీవితం తెరిచిన పుస్తకం.. మీరు మా ఇంటికి వస్తే పుస్తకాలు.. చిరిగిన బూట్లు.. ఖాళీ జేబులే దర్శనిమిస్తాయి’ అని స్పష్టంచేశారు.
మైనర్ కేసుపై రాష్ట్ర హోంశాఖ మంత్రి బాధ్యతల్లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి మొదటి నుంచి అలసత్వం వహిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. మొన్న ఆయన ఓ మీడియా కాన్క్లేవ్లో ఘోరమైన అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ ప్రశ్నాస్త్రాలు సంధించారు. గవర్నర్, కేంద్ర మంత్రులైనా ఏదైనా వ్యవహారంపై నేరుగా పోలీసులకు చెప్పరు.. ప్రొటోకాల్ ప్రకారం సీఎంతోనే మాట్లాడుతారని ఉటంకిస్తూ.. పోక్సో కేసుపై బండి సంజయ్ కూడా కచ్చితంగా సీఎంకు చెప్పి ఉంటారు.. బండి మీకు ఏం చెప్పారు? మీరు (రేవంత్‌రెడ్డి) డీజీపీ, సైబరాబాద్, కరీంనగర్ సీపీలకు ఎలాంటి సూచనలు ఇచ్చారో? గుండెపై చెయ్యి వేసుకొని ప్రజలకు సమాధానం చెప్పండి? పేట్ బషీరాబాద్ ఠాణాలో బాధితురాలైన మైనర్ తల్లి 9నుంచి 12 గంటల వరకు వేచి ఉన్నా పోలీసులు ఎందుకు ఫిర్యాదు తీసుకోలేదు? బండి భగీరథే వెళ్లి కరీంనగర్ టౌటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టిన్రు అని మీరు చెప్పిన్రు.. ఇందులో వాస్తవం ఉన్నదా? భగీరథ్ కరీంనగర్ ఠాణాకు వెళ్లలేదని మేం చెబుతున్నది ముమ్మాటికీ నిజం కాదా? 18 గంటలు రివ్యూ చేస్తున్న మీకు ఎందుకు తెలియలేదు? కరీంనగర్ సీపీ మీకు చెప్పలేదా? ఇప్పటికైనా ఫోన్‌చేసి అడగండి? ఎవరో పంపించిన ఫిర్యాదుపై కరీంనగర్లో ఆగమేఘాలపై కేసు నమోదు చేసి.. పేట్ బషీరాబాద్ ఠాణాలో బాలిక తల్లి ఫిర్యాదుపై నిర్లక్ష్యం చేసింది నిజంకాదా? అలాగే ప్రధాని పర్యటన బందోబస్తుకు పేట్ బషీరాబాద్ స్టేషన్ ఇన్స్పెక్టర్ను గానీ, పోలీసులను గానీ వినియోగించలేదనేది వాస్తవం కాదా?’ పేట్ బషీరాబాద్ ఠాణాలో బెయిలబుల్ సెక్షన్లపై, కరీంనగర్ ఠాణాలో నాన్ బెయిలబుల్ సెక్షన్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదా?అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నేను తప్పు చెబితే ఏ శిక్షకైనా సిద్ధం అని సవాల్ విసిరారు.
ఆయన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి.. ఆయనకేం తెలుసు? అంటూ తనను సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే అంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అభ్యంతరం వ్యక్తంచేశారు. తాను ఐపీఎస్ అధికారిగా తాను వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకున్నానని, రాజకీయవేత్తగా మారానని, పోలీస్ బ్రెయిన్‌ను పక్కకు పెట్టానని చెప్పారు. కానీ, రేవంత్‌రెడ్డి పదే పదే తన పోలీస్ బ్రెయిన్‌ను నిద్రలేపుతున్నారని సూటిగా చెప్పారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 51 శాతం మంది తనకు ఓటు వేస్తే చాలు, మిగతా 49 శాతం మంది తనకు వేయకపోయినా పర్వాలేదని సీఎం అన్నారని తెలిపారు. అంటే ఆ 51 శాతం మందిలో బండి భగీరథ్ కుటుంబం ఉండి, ఆ 49 శాతం మందిలో బాధితురాలైన మైనర్ ఉన్నదా? అందుకే పట్టించుకోవడం లేదా? అని ప్రశ్నించారు. అందుకే కనీసం బాధితురాలికి సీఎం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదా? అని నిలదీశారు.
ప్రతిపక్షాలపై కక్ష సాధించడంలేదని చెప్పిన రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, విచారణల పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం, ఫోన్‌ట్యాపింగ్ ముసుగులో కక్ష సాధించారని మండిపడ్డారు. ఇందుకోసం అభిషేక్ మనూ సింగ్వి లాంటి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి రూ.17 కోట్ల 7లక్షలను ఖర్చు చేయలేదా? అని ప్రశ్నించారు. కానీ మైనర్ కేసులో వాదనలు వినిపించేందుకు పీపీకి సపోర్ట్‌గా పెద్ద లాయర్లను ఎందుకు పెట్టలేదు? ఎందుకీ వివక్ష? బండిపై ప్రేమనా? రాజకీయ డ్రామానా? అని ప్రశ్నించారు. తన ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపిన క్రిశాంక్, నల్లబాలు, జర్నలిస్టులు రేవతి, దొంతు రమేశ్‌పై కేసులు నమోదు చేసి వెంటాడి వేటాడి పట్టుకున్న పోలీసులు.. బాలిక విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి నిందితుడికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను డిమాండ్ చేశారు. అలాగే బండి భగీరథ్ వ్యవహారంపై మహిళా మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు.