హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో జరగనున్న అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ మసాబ్‌ట్యాంక్‌లోని ఎన్నికల కమిషనర్ పార్థసారథి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు పాల్గొన్నారు.
42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని వారు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్ల జాబితా రూపొందిస్తున్నారని, బీసీల రిజర్వేషన్లను 42 శాతంగా అమలయ్యేలా చూడాలని కోరారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై 8 నెలలుగా రెండుసార్లు పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షలు చేసి ఎలాంటి ఆదేశాలు ఇచ్చిందో తేల్చాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా కులగణనకు డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో అధికారంలో ఉన్నా కులగనన, బీసీగణన చేయకుండా పంచాయతీరాజ్ ఎన్నికలకు వెళ్తుందనే అనుమానాలు ప్రజల్లో ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీల పాలనాకాలం ముగిసి ఏడు నెలలు ముగిసినా బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ పెంపు అంశంపై గానీ ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇవ్యకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు అంశం ప్రభుత్వ పరిధిలో ఉన్నదని ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. ఈ నెల 6న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తారని, 9న జిల్లా స్థాయిలో, 10న మండల స్థాయిలో రాజకీయ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. పోలింగ్ కేంద్రాలు ఒక కిలోమీటరు పరిధిలోనే ఉండేలా చూడాలని సూచించారు. వార్డుల విభజనలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకే వార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలతోపాటు కాంగ్రెస్ నుంచి నిరంజన్, బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి, సీపీఎం నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఐ నుంచి చాడ వెంకట్‌రెడ్డి హాజరయ్యారు.
రాష్ట్రంలో 12,966 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,14,620 వార్డులు ఉన్నాయని అఖిలపక్ష సమావేశంలో ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆయా వివరాలను పార్టీల ప్రతినిధులకు అందజేసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 868 పంచాయతీలు ఉండగా, అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 62 మాత్రమే ఉన్నాయని అధికారులు తెలిపారు. వార్డులపరంగా చూస్తే అత్యధికంగా నల్లగొండ జ్లిలాలో 7,482, మేడ్చల్ జిల్లాలో 604 మాత్రమే ఉన్నాని వివరించారు.